Rahul Gandhi: తల్లిని మించిన రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సత్తా చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఆయన విజయఢంకా మోగించారు.

Updated : 05 Jun 2024 05:38 IST

రాయ్‌బరేలీలో సోనియాకంటే ఎక్కువ ఆధిక్యం
వయనాడ్‌లోనూ 3.64 లక్షల ఓట్ల మెజారిటీ

రాయ్‌బరేలీ, తిరువనంతపురం: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సత్తా చాటారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన రెండుచోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, భాజపా నేత దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై 3,90,030 ఓట్ల ఆధిక్యంతో ఆయన నెగ్గారు. 2019లో ఇదే స్థానంలో తన తల్లి సోనియాగాంధీ సాధించిన 1,67,178 ఓట్ల మెజారిటీని రాహుల్‌ అధిగమించారు. అమేఠీ నుంచి కాకుండా తొలిసారి రాహుల్‌ రాయ్‌బరేలీలో పోటీచేసిన విషయం తెలిసిందే. తాజా ఫలితాలతో రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ కంచుకోటగా మరోసారి నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడినుంచి మూడుసార్లు, అంతకుముందు ఆమె భర్త ఫిరోజ్‌గాంధీ రెండుసార్లు విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్‌ పోటీ చేయాల్సి వచ్చింది. పార్టీ విజయపరంపరను ఆయన కొనసాగించినట్లయింది. సిటింగ్‌ స్థానమైన కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి ఆయన జయకేతనం ఎగురవేశారు. సీపీఐ అభ్యర్థి అనీ రాజాపై 3,64,222 ఓట్ల ఆధిక్యం సాధించారు. భాజపా అభ్యర్థి కె.సురేంద్రన్‌ మూడో స్థానానికే పరిమితమయ్యారు. రెండింట్లో ఏ స్థానాన్ని రాహుల్‌ వదులుకుంటారో తేలాల్సి ఉంది.

అమేఠీలో స్మృతి ఇరానీపై కిశోరీలాల్‌ గెలుపు 

అమేఠీలో రాహుల్‌ బదులు బరిలో దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మ తనపై సోనియా కుటుంబ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై ఆయన 1,67,196 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని