Rahul Gandhi: వయనాడ్‌ను వదులుకునే యోచనలో రాహుల్‌

కేరళలోని వయనాడ్‌ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆ స్థానం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి

Published : 08 Jun 2024 19:37 IST

దిల్లీ: కేరళలోని వయనాడ్‌ నుంచి విజయం సాధించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆ స్థానం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానాల నుంచి బరిలోకి దిగిన రాహుల్‌.. రెండుచోట్లా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలాకాలంగా తన కుటుంబీకులే పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ.. వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేయాలని రాహుల్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

ఈమేరకు శనివారం దిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తన అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి రాహుల్‌ తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై జూన్‌ 17న అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. 2019 ఎన్నికల్లో యూపీలోని అమేఠీ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేశారు. అమేఠీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్‌ గెలుపొంది తన కంచుకోటలను కాపాడుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని