Rahul Gandhi: తెదేపా, జేడీయూలను సంప్రదించడంపై నేడు నిర్ణయం: రాహుల్‌

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెదేపా, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం జరిగే ‘ఇండియా’ కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు.

Updated : 05 Jun 2024 10:38 IST

దిల్లీ: కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం తెదేపా, జేడీయూ వంటి మాజీ భాగస్వామ్య పక్షాలను సంప్రదించే అంశంపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో బుధవారం జరిగే ‘ఇండియా’ కూటమి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీయే కూటమి పార్టీలను సంప్రదిస్తారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ భేటీకి శరద్‌పవార్, మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్, చంపయి సొరేన్, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్, సీతారాం ఏచూరి, డి.రాజా తదితర ప్రతిపక్ష నేతలు హాజరుకానున్నారు.  ‘‘మిత్రపక్షాలతో చర్చించకుండా ఏమీ చెప్పలేము. బుధవారం నాటి సమావేశంలో జరిగే నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం’’ అని రాహుల్‌ పేర్కొన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలు భాజపాకు సొంతంగా రాని నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి దేశ ప్రజలు కలసికట్టుగా పోరాటం చేస్తారని నేను అంచనావేశా. రాజ్యాంగ పరిరక్షణ కోసం అతిపెద్ద తొలి అడుగు పడింది. పేదలు, అణగారిన వర్గాలవారే ఇందులో కీలక పాత్ర పోషించారు’’ అని రాహుల్‌ తెలిపారు. ఇండియా కూటమి.. దేశానికి పేదల అనుకూల విజన్‌ను ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపి, రాజ్యాంగాన్ని రక్షించారంటూ ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇండియా కూటమి మిత్ర పక్షాలను కాంగ్రెస్‌ నేతలు ఎప్పుడూ గౌరవంగా చూసుకున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు ఈ దేశాన్ని పాలించకూడదని ఈ ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయన్నారు. 

ఇంకా నిర్ణయం తీసుకోలేదు

వయనాడ్, రాయ్‌బరేలీలో విజయంపై రాహుల్‌ స్పందించారు. ‘‘రెండు స్థానాల్లో ఉండటం కుదరదు. దానిపై ఆలోచిస్తున్నాను. ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని వెల్లడించారు. తనను గెలిపించిన వయనాడ్, రాయ్‌బరేలీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

ఇది మోదీ వ్యతిరేక తీర్పు

తాజా ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ‘‘ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఇది మోదీకి, ప్రజలకు మధ్య జరిగిన పోరాటం. ప్రజలు ఎవరికీ పూర్తి ఆధిక్యాన్ని ఇవ్వలేదు. ఇది మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని స్పష్టమవుతోంది. మోదీ పేరు మీదుగా ఓట్లు అడిగారు కాబట్టి ఇది ఆయనకు రాజకీయంగానే గాకుండా నైతికపరమైన ఓటమి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని