Rahul Gandhi: గంగపుత్రులపై రాహుల్ హామీల వర్షం.. లీటరు డీజిల్‌పై ₹25 రాయితీ.. ఇంకా..!

Karnataka Elections:కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) మత్స్యకారులపై హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రూ.10లక్షల బీమా సౌకర్యంతో పాటు వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం, లీటరు డీజిల్‌పై రూ.25ల చొప్పున రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Updated : 27 Apr 2023 19:22 IST

ఉడుపి: కర్ణాటక ఎన్నిక(Karnataka Elections)ల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో భాజపా, కాంగ్రెస్‌ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లను తమ వైపు ఆకర్షించేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. తాజాగా ఉడుపి జిల్లాలోని కాపు ప్రాంతంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) వారిపై హామీల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే.. గంగపుత్రులకు రూ.10లక్షల బీమా సౌకర్యంతో పాటు వడ్డీ లేకుండా రూ.లక్ష రుణం, రోజుకు 500 లీటర్ల వరకు ఒక్కో లీటరు డీజిల్‌పై రూ.25ల చొప్పున రాయితీ అందించనున్నట్టు హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా భాజపా పాలనపై విమర్శలు గుప్పించారు. అవినీతి, ధరల పెరుగుదల మత్స్యకారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్నారు. అలాగే, బ్యాంకు రుణాలు పొందడం కూడా వారికి కష్టంగా మారిందని ఆరోపించారు.  చేపల సంఖ్య తగ్గిపోతుండటం,  ఖర్చులు పెరిగిపోవడంతో వేట కష్టంగా మారిందన్నారు. అందుకే మత్స్యకారులకు ఉపశమనం కలిగించే చర్యలపై కాంగ్రెస్‌ దృష్టిపెడుతోందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ తొలి కేబినెట్‌ సమావేశంలోనే అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌ కేవలం హామీలు మాత్రమే ఇవ్వదని.. వాటిని తొలి రోజు నుంచే అమలు చేస్తుందని చెప్పారు. కర్ణాటక ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య పోటీగా అభివర్ణించిన రాహుల్‌.. తమ పార్టీ పేదలు, అట్టడుగు వర్గాల కోసమే పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న భాజపా సర్కార్‌ ప్రజలు ఎన్నుకున్నది కాదని.. రూ.కోట్లతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్ల ఏర్పాటైందంటూ దుయ్యబట్టారు. సీఎం పోస్టును రూ.2,500 కోట్లకు అమ్మారంటూ భాజపా ఎమ్మెల్యేలే చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఏ పని జరగాలన్నా 40శాతం కమీషను డిమాండ్‌ చేస్తున్నారంటూ కాంట్రాక్టర్ల అసోసియేషనే ఫిర్యాదు చేసిందన్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, అసిస్టెంట్‌ ఇంజినీర్ల నియామకాల్లో సైతం అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు ఖర్చు చేయకుండా కేవలం మిలియనీర్లైన తమ స్నేహితులకే భాజపా ఖర్చు చేస్తోందన్నారు. 

మరోవైపు, మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు  కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే అనేక హామీలు ఇచ్చింది. ప్రతి ఇంటికీ  200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌(గృహజ్యోతి), మహిళలకు నెలకు రూ.2వేల సాయం (గృహలక్ష్మీ), దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ 10కిలోల వరకు ఉచిత బియ్యం (అన్న భాగ్య),  గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి రూ.3వేలు చొప్పున , డిప్లొమా చేసినవారికి (18-25 ఏళ్ల మధ్య ) రెండేళ్ల వరకు రూ.1500 చొప్పున సాయం అందించనున్నట్టు గతంలోనే హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. మే 10న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని