Congress: విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లిస్తాం.. కేజీ ఆవుపేడను ₹2లకు కొంటాం: గహ్లోత్‌ హామీ

ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ హామీలు గుప్పిస్తోంది. ఇటీవల ప్రకటించిన కొన్ని హామీలకు తోడు తాజాగా మరో 5 హామీలను సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించారు.

Updated : 27 Oct 2023 16:08 IST

జైపూర్‌: రాజస్థాన్‌లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌  హామీల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులకు తొలి ఏడాది ట్యాబ్‌ లేదా ల్యాప్‌టాప్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.  శుక్రవారం జైపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఐదు గ్యారెంటీలను ప్రకటించారు. నవంబర్‌ 25న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ మార్చేందుకు అవకాశం లేకుండా పాత పింఛను విధానాన్ని(OPS) అమలు చేసేలా చట్టం చేస్తామన్నారు. అలాగే, ‘గోధన్’ పథకం కింద కిలో ఆవుపేడను ₹2 చొప్పున కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించారు.  అలాగే, ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాల్లో జరిగిన నష్టానికి రూ.15లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తామన్న ఆయన.. అందులో మరిన్ని హామీలు ఉంటాయని స్పష్టంచేశారు. 

నన్ను అంతమొందించేందుకు కుట్ర: ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ

ఇటీవల ఝుంఝునులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంటగ్యాస్‌ సరఫరా చేస్తామని, ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉన్న మహిళకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇస్తామని అశోక్‌ గహ్లోత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఈడీపై తీవ్ర విమర్శలు..

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ దోతస్రా నివాసాలతో పాటు తన కుమారుడి నివాసంలో ఈడీ సోదాలు జరపడంపై గహ్లోత్‌ విరుచుకుపడ్డారు. ఈడీని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ‘‘దేశంలో ఈడీ వీధికుక్కల కన్నా ఎక్కువగా తిరుగుతోందంటూ ఒక సీఎం (భూపేశ్‌ బఘేల్‌) అనాల్సి వచ్చింది. ఇంతకన్నా దురదృష్టం ఇంకేం ఉంటుంది? ఆయన అలాంటి వ్యాఖ్య చేశారంటే.. ఎంత బాధతో అని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఈడీ, సీబీఐ రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయి. మోదీజీ.. మీకు ఇంకా అర్థంకానట్లుంది.. మీ కౌంట్‌ డౌన్‌ మొదలైంది’’ అని వ్యాఖ్యానించారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందు వల్లే కాంగ్రెస్‌కు చెందిన నేతలపై ఈడీ దాడులు జరుగుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని