Ajit Pawar: ‘2024 వరకు ఎందుకు..?’ సీఎం పదవిపై అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం మహారాష్ట్ర (Maharashtra)రాజకీయాల్లో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) కదలికలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్ని వివరణలు వచ్చినప్పటికీ.. ఆయన భాజపాతో చేతులు కలుపుతారా..? అనే ప్రశ్నలు మాత్రం ఆగడం లేదు. 

Published : 22 Apr 2023 15:53 IST

పుణె: ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌(Ajit Pawar)రాజకీయంగా ఎలాంటి స్టెప్‌ వేయనున్నారనే వార్తలు.. ఇప్పుడు మహారాష్ట్ర(Maharashtra)లో ఆసక్తికరంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి పదవి గురించి ఆయన ఓ మీడియాకు ఇచ్చిన సమాధానమే అందుకు కారణం. 

మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అని అజిత్‌ పవార్‌(Ajit Pawar)ను అడగ్గా..‘వందశాతం అనుకుంటున్నా’ అంటూ టక్కున సమాధానం ఇచ్చారు. గత 20 ఏళ్లలో ఎన్‌సీపీ ఉపముఖ్యమంత్రి పదవికి పరిమితం కావడంపై ప్రశ్నించగా.. ‘2004లో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్నికల్లో పోటీ పడ్డాయి. మేం 71 సీట్లు గెల్చుకోగా.. కాంగ్రెస్‌కు 69 వచ్చాయి. కాంగ్రెస్‌తో సహా అంతా సీఎం పదవి ఎన్‌సీపీదే అనుకున్నారు. కానీ ఈ పదవులపై దిల్లీలో నిర్ణయం తీసుకున్నారు. హస్తం పార్టీకి సీఎం, ఎన్‌సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవి అని సందేశం వచ్చింది. మా పార్టీ నేత ఆర్‌ఆర్‌ పాటిల్‌ను శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నాం. ఎన్‌సీపీ(NCP)కి సీఎం పదవి ఇచ్చుంటే.. ఆయనే సీఎం అయ్యేవారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఆటోమేటిక్‌గా ఆ పార్టీకే సీఎం పదవి దక్కింది’ అని సమాధానమిచ్చారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ(NCP) ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతుందా? అని ప్రశ్నించగా.. ‘2024 వరకు ఎందుకు? మేం ఇప్పుడు కూడా ఆ పదవి పొందేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. అది ఎలా..?ఏంటి..?అనేది మాత్రం వివరించలేదు. ఇదిలా ఉంటే.. అజిత్(Ajit Pawar) తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల వినిపిస్తున్నాయి. ఆ వార్తలను ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్, అజిత్ తోసిపుచ్చినా అవి ఆగకపోవడం గమనార్హం. తాజాగా ఆయన పార్టీ సమావేశానికి గైర్హాజరుకావడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని