Revanth reddy: సీఎం నిర్ణయం.. జంట నగరాలపై అణువిస్పోటం: రేవంత్‌ రెడ్డి

జీవో 111 రద్దు చేస్తే కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం జంట నగరాలపై అణువిస్ఫోటం లాంటిదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Updated : 22 May 2023 17:57 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన బినామీలు, బంధువర్గాలకు రూ. లక్షల కోట్ల ఆస్తులు కట్టబెట్టడమే హైదరాబాద్‌లో 111 జీవో రద్దు లక్ష్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం జంట నగరాల పర్యావరణంపై అణువిస్పోటం లాంటిదని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తాగునీటి సమస్య పేరు చెప్పి.. కేసీఆర్‌ సమస్యను చిన్నదిగా చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బినామీ చట్టాన్ని వర్తింపజేసి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఎవరెవరికి భూములు కేటాయించారన్న అంశంపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తామని రేవంత్‌ ప్రకటించారు. ‘‘ 111 జీవో నిర్ణయం వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం ఉంది. మొత్తం భూములను పేదల నుంచి కొనుగోలు చేశాక ఇప్పుడు జీవో రద్దు చేశారు. కేసీఆర్‌ బంధుగణం, బినామీ చేతుల్లోనే 80 శాతం భూములు ఉన్నాయి. కేసీఆర్‌ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారు. బినామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం పటిష్ఠంగా అమలు చేయాలి. జంటనగరాలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి.. ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

కర్ణాటక తీర్పే తెలంగాణలోనూ..

కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేస్తే కర్ణాటక తీర్పే తెలంగాణలోనూ వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులెవరూ లేరన్న ఆయన.. ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. పార్టీ, ప్రజల కోసం పది మెట్లు దిగడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే హాజరయ్యారు. పీసీసీ కార్యవర్గంతోపాటు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, పీసీసీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ... అధికారం ఉందని విర్రవీగిన మోదీకి కర్ణాటక ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటక ప్రజలను అభినందిస్తూ.. దీనికి కారణమైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంక, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. యూత్‌ డిక్లరేషన్‌ను భవిష్యత్‌ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలన్న రేవంత్‌రెడ్డి.. పేదల పక్షాన నిలవాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్‌ క్రియాశీల పాత్రను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని రేవంత్‌ దిశా నిర్దేశం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని