TDP: దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ.. 39 ఏళ్లుగా దక్కని స్థానాల్లోనూ తెదేపా విజయం

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సరికొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నో ఏళ్లుగా ఖాతా తెరవలేకపోయిన నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. ప్రత్యర్థికి బలమైన పట్టున్న 40 స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది.

Updated : 05 Jun 2024 09:53 IST

ఐదు నియోజకవర్గాల్లో మొదటిసారి గెలుపు 

ఉప్పొంగిన అభిమానం: తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద సంబరాల్లో విజయ సంకేతం చూపుతున్న యువతి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా కూటమి విజయం సరికొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నో ఏళ్లుగా ఖాతా తెరవలేకపోయిన నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. ప్రత్యర్థికి బలమైన పట్టున్న 40 స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌/వైకాపాకు బలమైన పట్టున్న ఆ నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల 1994లో, మరికొన్ని చోట్ల 1999లో చివరగా పార్టీ గెలుపొందింది. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల క్రితం చేజారిన నియోజకవర్గాలపై తెదేపా తిరిగి పట్టుసాధించింది.

1985 తర్వాత అపూర్వ విజయం

  • నాలుగు దశాబ్దాలుగా దక్కని నియోజకవర్గాలను సైతం తెదేపా కూటమి చేజిక్కించుకుంది. 5 నియోజకవర్గాల్లో దాదాపు 39 ఏళ్ల తర్వాత తెదేపా తిరిగి విజయం సాధించింది. 
  • విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి 1985లో వెంకట చిన అప్పలనాయుడు గెలిచారు. 2024లో మళ్లీ రంగారావు పార్టీ తరఫున విజయాన్ని దక్కించుకున్నారు.    
  • తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వీరవెంకట రామారావు తెదేపా అభ్యర్థిగా 1985లో గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో మిరియాల శిరీష తిరిగి పార్టీ అభ్యర్థిగా గెలిచారు.
  • విజయవాడ వెస్ట్‌లో పొత్తులో భాగంగా సీపీఐ తరఫున ఉప్పలపాటి రామచంద్రరాజు 1985లో గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ప్రత్యర్థి పార్టీలే గెలుస్తున్నాయి. ఇప్పుడు పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థి సుజనా చౌదరి గెలిచారు.
  • కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి 1985లో శిఖామణి చివరగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌/వైకాపా గెలుస్తూ వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో అక్కడ తెదేపా అభ్యర్థిగా దస్తగిరి గెలిచారు.

మూడు దశాబ్దాల తర్వాత తెదేపా ఖాతాలో..

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరులో తెదేపా చివరిసారిగా 1994లో గెలిచింది. అక్కడ జీవీ శ్రీనాథరెడ్డి అప్పట్లో గెలిచారు. తర్వాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌/వైకాపా అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఇదే జిల్లా పరిధిలోని చంద్రగిరిలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు 1994లో గెలిచారు. ఇప్పుడు మళ్లీ పార్టీ అభ్యర్థి పులివర్తి నాని గెలుపొందారు. 
  • నెల్లూరు సిటీ నుంచి తెదేపా తరఫున 1994లో రమేష్‌రెడ్డి విజయం సాధించిన తర్వాత మళ్లీ పార్టీ అక్కడ గెలవలేదు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నారాయణ గెలుపొందారు. 
  • ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొమ్మి లక్ష్మయ్యనాయుడు 1994లో తెదేపా తరఫున గెలిచారు. తర్వాత మళ్లీ ఇప్పుడే ఆనం రామనారాయణరెడ్డి తెదేపా నుంచి గెలిచారు.
  • గుంటూరు జిల్లాలోని మంగళగిరి రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షించింది. ఇక్కడ తెదేపాతో పొత్తులో భాగంగా సీపీఎం తరఫున నిమ్మగడ్డ రామ్మోహనరావు 1994లో గెలిచారు. మళ్లీ తెదేపా అభ్యర్థిగా లోకేశ్‌ ఇప్పుడు విజయాన్ని దక్కించుకున్నారు.

రెండున్నర దశాబ్దాల తర్వాత.. కూటమికి విజయం 

రాష్ట్రవ్యాప్తంగా 22 నియోజకవర్గాల్లో రెండున్నర దశాబ్దాల తర్వాత తెదేపా విజయం సాధించింది. ఈ నియోజకవర్గాల నుంచి చివరగా 1999లో తెదేపా గెలిచింది. 2004, 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌/వైకాపా గెలిచాయి. ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి తెదేపా కూటమి పట్టుసాధించింది. 

ఇక్కడ మొదటిసారి తెదేపా జెండా

కురుపాం, పామర్రు, నెల్లూరు రూరల్, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో తెదేపా మొదటిసారి విజయాన్ని దక్కించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి 2004, 2009, 2014, 2019లో నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లోనూ ప్రత్యర్థులే గెలుపొందారు. 

ఈ నియోజకవర్గాలు తెదేపా కంచుకోటలు

2019లో భారీస్థాయిలో గెలిచిన వైకాపా ఎంతగా ప్రయత్నించినా తెదేపా కంచుకోటల్లో పాగా వేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఇచ్ఛాపురం, టెక్కలి, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం, పెద్దాపురం, మండపేట, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం గ్రామీణ, పాలకొల్లు, ఉండి, గన్నవరం, విజయవాడ తూర్పు, రేపల్లె, గుంటూరు పశ్చిమ, పర్చూరు, అద్దంకి, చీరాల, కొండపి, కుప్పం, హిందూపురం నియోజకవర్గాలను వైకాపా దక్కించుకోలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని