Sajjala: ఏ అవకాశం దొరికినా ఏపీ ఉమ్మడిగా ఉండాలనే కోరతాం: సజ్జల

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ వైకాపా పోరాటం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైకాపా విధానమని ఆయన వ్యాఖ్యానించారు.

Updated : 08 Dec 2022 15:34 IST

అమరావతి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ వైకాపా పోరాటం చేసిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే వైకాపా విధానమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రం అయ్యేందుకు ఏ అవకాశం దొరికినా మళ్లీ కలిసేందుకే తమ పార్టీ ఓటు వేస్తుందని చెప్పారు. అయితే విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినందున పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపైనే తాము దృష్టిపెడుతున్నామన్నారు. అమరావతిలో మీడియాతో సజ్జల మాట్లాడారు. 

‘‘అప్పట్లో తెదేపా, కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించాయి.  విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి పోరాటం చేసింది.. మళ్లీ ఉమ్మడి ఏపీ అయితే తొలుత స్వాగతించేది వైకాపానే. ఏపీ విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తాం. విభజన జరిగిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. ఉమ్మడి ఏపీ కలిసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. మళ్లీ ఉమ్మడి ఏపీ కాగలిగే అవకాశముంటే ఆ విషయంలో ఎంతవరకైనా ముందుకెళ్లేది వైకాపానే. ఏ వేదిక దొరికినా మళ్లీ కలిసేందుకే ఓటు వేస్తాం. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉంటాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని