అమిత్‌ షా చెప్పినా వినని ఈశ్వరప్ప.. రిటైర్మెంట్‌ పక్కన పెట్టి మరీ పోటీ

కర్ణాటక(Karnataka)లో శివమొగ్గ నియోజకవర్గంలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. అది భాజపాకు ఇబ్బందికరంగా పరిణమించింది. 

Published : 02 Apr 2024 18:13 IST

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక (Karnataka)కు చెందిన శివమొగ్గ (Shivamogga) నియోజకవర్గం భాజపాకు తలనొప్పిగా మారింది. ఆ స్థానంలో ఇప్పటికే భాజపా అభ్యర్థిని దించగా.. ఆ పార్టీకే చెందిన మరో అసంతృప్త కీలక నేత అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు అగ్రనేత అమిత్ షా చెప్పినా వినడానికి సిద్ధంగా లేకపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే..?

శివమొగ్గ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా సీనియర్ నేత కేఎస్‌ ఈశ్వరప్ప (Eshwarappa) ఐదుసార్లు విజయం సాధించారు. రాజకీయాలకు రిటైర్మెంట్‌ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడు శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yediyurappa) కుమారుడు బీవై రాఘవేంద్రను పార్టీ బరిలో దించింది. తన కుమారుడు కాంతేశ్‌కు హవేరీ నుంచి టికెట్‌ ఇవ్వకపోవడమే ఈశ్వరప్ప అసంతృప్తి కారణమైంది. తన కుమారుడికి టికెట్‌ దక్కేలా చేస్తానని మాట ఇచ్చి మోసగించారని యడియూరప్పపై ఈశ్వరప్ప మండిపడ్డారు. టికెట్ రాకపోవడానికి ఆయనే కారణమని ఆరోపిస్తూ రిటైర్మెంట్‌ను పక్కన పెట్టేసి, ఎన్నికల బరిలో దిగారు.

రాహుల్‌ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదు: అమిత్‌ షా

ఈశ్వరప్పను బుజ్జగించేందుకు అమిత్‌ షా (Amit Shah) రంగంలోకి దిగినా ప్రయోజనం లేకపోవడం గమనార్హం. ‘ఈ ఉదయం అమిత్‌ షా నాకు ఫోన్ చేశారు. మీ స్థాయి వ్యక్తి ఇలా పోటీలోకి రావడం ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకు పోటీచేస్తున్నారని అడిగారు. నామినేషన్ పత్రాలు ఉపసంహరించుకోవాలని కోరారు. నాకు పలు హామీలు ఇచ్చారు. అలాగే ఏప్రిల్ 3న దిల్లీలో ఒకసారి భేటీ అవుదామని చెప్పారు’’ అని ఈశ్వరప్ప వెల్లడించారు. ఆయనతో భేటీ అవుతానని, అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని ఒత్తిడి చేయొద్దని కోరానని అన్నారు. ‘‘ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వెనక ఉన్న నా ఉద్దేశాన్ని ఆయన తప్పక అర్థం చేసుకుంటారు. నేను ఎన్నికల్లో గెలుస్తాను. దాంతో నా లక్ష్యాలు నెరవేరతాయి’’ అని అన్నారు.

అలాగే తండ్రీకుమారుల నియంత్రణ నుంచి పార్టీకి విముక్తి కల్పించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. యడియూరప్ప కుటుంబాన్ని ఉద్దేశించి ఈ మాట అన్నారు. 2009 నుంచి యడియూరప్ప, బీవై రాఘవేంద్ర.. శివమొగ్గకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు బీవై విజయేంద్ర.. శికారిపుర ఎమ్మెల్యే. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక రాఘవేంద్ర.. కాంగ్రెస్ అభ్యర్థి గీతా శివరాజ్‌కుమార్‌ను ఎదుర్కో నున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని