Sharad pawar: ఆ రోజు మోదీని కలిసి స్పష్టంగా చెప్పేశా: పవార్‌

తాజాగా విడుదల చేసిన ఆత్మకథలో ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్(Sharad Pawar).. 2015 తర్వాత చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలను రాసుకొచ్చారు. 2019 నాటి పరిస్థితిని వివరించారు. 

Published : 04 May 2023 16:30 IST

ముంబయి: ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన మద్దతుదారులకు షాకిచ్చారు శరద్ పవార్(Sharad Pawar). ఆ సమయంలోనే విడుదల చేసిన ఆయన ఆత్మకథ నుంచి పలు రాజకీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపాతో పొత్తు విషయంలో 2019లో ప్రధాని మోదీ(Modi)కి తాను ఇచ్చిన స్పష్టతను పవార్‌ అందులో పేర్కొన్నారు. 

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో మహారాష్ట్ర(Maharashtra)లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి నెలకొంది. ఆ సమయంలో భాజపా, ఎన్‌సీపీ మధ్య అనధికారిక చర్చలు జరిగాయని పవార్‌ ఆత్మకథలో వెల్లడించారు. ‘ఎన్‌సీపీతో పొత్తుకు అవకాశం ఉంటుందా..? అని భాజపా అన్వేషించడం ప్రారంభించింది. కానీ నేను ఆ ప్రక్రియలో కలగజేసుకోలేదు. భాజపాతో అధికారిక చర్చలు జరగలేదు కానీ, అనధికారిక చర్చలు జరిగాయి. కమలం పార్టీతో కలిసివెళ్లే ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఆ క్రమంలో 2019లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో మోదీని కలిసి, పొత్తు కుదరదని స్పష్టంగా చెప్పాను. నేను ఆ మాట చెప్తున్నప్పటికే.. మా పార్టీలో కొందరు భాజపాతో కలిసివెళ్లాలని చూస్తున్నారు’ అని తన సోదరుడు కుమారుడు అజిత్‌ పవార్‌( Ajit Pawar)ను ఉద్దేశించి శరద్ పవార్ వెల్లడించారు. 

మోదీ-పవార్‌ సమావేశం తర్వాత కొద్దిరోజులకు ఎన్‌సీపీలో కీలక నేత అయిన అజిత్‌( Ajit Pawar)తో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణం కూడా చేశారు. ఆ తర్వాత వెంటనే సొంతగూటికి చేరడంతో ఆ ప్రభుత్వం పడిపోయింది. 

సుప్రియకు రాహుల్ ఫోన్‌...!

శరద్ పవార్‌ రాజీనామా తర్వాత ఆయన కుమార్తె సుప్రియా సూలే(Supriya Sule)కు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్‌ చేసినట్లు సమాచారం. అలాగే పవార్ తర్వాత ఆ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రేపు ముంబయిలో జరిగే సమావేశంలో దీనికి సమాధానం దొరకొచ్చని తెలుస్తోంది.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని