LS Polls: ‘నేను సీఎంగా ఉండాలా? వద్దా..?’ సిద్ధరామయ్య భావోద్వేగం

తాను సీఎంగా కొనసాగాలంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని సొంత నియోజకవర్గమైన ‘వరుణ’ ఓటర్లకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేశారు.

Published : 02 Apr 2024 00:07 IST

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెర పైకి వచ్చింది. ప్రచారంలో భాగంగా సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (DK Shivakumar)లు ఈమేరకు చేసిన ప్రసంగాలు చర్చనీయాంశంగా మారాయి. తాను సీఎంగా కొనసాగాలంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థికి భారీ ఆధిక్యం అందించాలని సొంత నియోజకవర్గమైన ‘వరుణ’ ఓటర్లకు సిద్ధరామయ్య భావోద్వేగపూరిత విజ్ఞప్తి చేయడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.

‘‘2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్థానిక కాంగ్రెస్‌ అభ్యర్థి కేవలం 1,817 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వరుణలో నాకు 48 వేల ఓట్ల మెజారిటీ అందించారు. ఇప్పుడు లోక్‌సభ పోరులో మా అభ్యర్థికి 60 వేల ఓట్ల ఆధిక్యం కట్టబెడితే సంతోషిస్తా. అదే జరిగితే.. నన్ను ఎవరూ తాకలేరు. నేను ముఖ్యమంత్రిగా ఉండాలా? వద్దా? కాబట్టి.. చేతులు జోడించి వేడుకుంటున్నా’’ అని ఓటర్లనుద్దేశించి సిద్ధరామయ్య ప్రసంగించారు. వరుణ అసెంబ్లీ స్థానం చామరాజనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

కచ్చతీవు రగడ.. కొందరు ఎంత వేగంగా రంగులు మార్చగలరో..?

మరోవైపు మండ్యలో నిర్వహించిన ప్రచారంలో డీకే మాట్లాడుతూ.. ‘‘నన్ను దృష్టిలో ఉంచుకొనే మీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం కట్టబెట్టారు. మీ కోరిక నెరవేరకపోదు’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కావాలన్న కాంక్షను ఆయన బహిరంగంగా వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. అయితే, సిద్ధరామయ్యకు ఆ పదవిని కట్టబెట్టిన అధిష్ఠానం.. డీకేను ఒప్పించి ఉప ముఖ్యమంత్రిని చేసింది. ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలనే ఫార్ములాపై రాజీ కుదిరిందని వార్తలు వచ్చినప్పటికీ.. పార్టీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు