BJP vote share: భాజపా ఓటింగ్‌.. తగ్గింది 1శాతం కంటే తక్కువే అయినా 63 సీట్లకు గండి!

BJP vote share: తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు తగ్గిన ఓట్ల శాతం తక్కువే అయినా.. సీట్ల పరంగా మాత్రం భారీ వ్యత్యాసం ఏర్పడింది.

Published : 05 Jun 2024 14:53 IST

BJP vote share | దిల్లీ: తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 36.6 శాతం ఓట్లు సాధించింది. 2019లో నమోదైన 37.3 శాతంతో పోలిస్తే తగ్గింది 0.7 శాతం మాత్రమే. కానీ, సీట్ల పరంగా మాత్రం భారీగా గండి పడింది. ఏకంగా 303 నుంచి 240కు పడిపోయాయి. 63 స్థానాలు తగ్గాయి. మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. క్రితం ఎన్నికల్లో 19.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈసారి 21.2 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. అంటే 1.7 శాతం ఓట్లు పెరిగాయి. కానీ, సీట్లు మాత్రం దాదాపు రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి.

పై గణాంకాలు స్పష్టంగా గమనిస్తే స్వల్ప ఓట్ల శాతమే సీట్ల విషయంలో పెద్ద వ్యత్యాసానికి దారితీశాయి. ఇది భారత ఎన్నికల వ్యవస్థలో ఉన్న వైవిధ్యానికి సూచిక. జాతీయస్థాయిలో ఓట్ల శాతం అనేది ఆయా రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం ఓట్లను సూచిస్తుంది. ఒక పార్టీకి ఓ రాష్ట్రంలో ఓట్ల శాతం పెరిగినా.. సీట్ల రూపంలో మాత్రం అది సత్ఫలితాలివ్వకపోవచ్చు. కానీ, అదే ఓట్లు కోల్పోతే మాత్రం పెద్ద నష్టమే మూట గట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా భాజపా, కాంగ్రెస్‌ విషయంలో అదే జరిగింది.

మహారాష్ట్రలో సీనియర్‌ పవార్‌దే పైచేయి

తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 2019తో పోలిస్తే 3.2 శాతం నుంచి 11.2 శాతానికి పెరిగింది. కానీ, పెరిగిన ఆ ఓట్లు ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాయి. పంజాబ్‌లో ఓట్ల శాతం 9.6 శాతం నుంచి 18.6 శాతానికి పెరిగింది. ఏ పార్టీతో పొత్తు లేకపోవటంతో ఉన్న రెండు సీట్లనూ చేజార్చుకోవాల్సి వచ్చింది. అలాగే బిహార్‌లో 23.6 శాతం నుంచి 20.5 శాతానికి కుంగడం ఐదు సీట్లకు గండికొట్టింది. పశ్చిమ బెంగాల్‌లో 1.6 శాతం ఓట్లు తగ్గగా.. ఆరు సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోనైతే తగ్గింది 1.4 శాతం ఓట్లే అయినా సీట్ల సంఖ్య మాత్రం 23 నుంచి 10కి పడిపోయాయి.

కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. మహారాష్ట్రలో 16.3 శాతం నుంచి 17.1 శాతం ఓట్లను పెంచుకొని సీట్ల సంఖ్యను ఏకంగా ఒకటి నుంచి 13కు చేర్చింది. రాజస్థాన్‌లో 3.7 శాతం ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా సున్నా నుంచి ఎనిమిది సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 శాతం నుంచి 9.5 శాతానికి ఓట్లు పెరగ్గా.. సీట్లు ఒకటి నుంచి ఆరుకు ఎగబాకాయి. ఆ రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల శాతం 18 నుంచి 33.5 శాతానికి పెరిగాయి. దీంతో పార్టీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 37 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి సాధించిన 43 శాతం ఓట్లు దాదాపు ఎన్డీయేకు సమానం కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని