MK Stalin: రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్‌

పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు మాయం కావడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎమ్‌కే స్టాలిన్‌ మండిపడ్డారు.

Published : 21 May 2024 17:33 IST

చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్‌ (MK Stalin) స్పందించారు. అవి ఒడిశా నుంచి తమిళనాడుకు చేరుకున్నాయని ప్రధాని ఆరోపించడంపై మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమిళ ప్రజలను అవమానించేందుకే మోదీ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ.. ఓట్ల కోసం తమిళనాడు ప్రజలను పొగిడారు. కానీ, రత్న భాండాగారం తాళం చెవులు తమిళనాడుకు చేరుకున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆ భగవంతుడితో సహా తమిళ ప్రజలను కించపరిచేలా ఉన్నాయి. ఆయన ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్నారు. కేవలం ఓట్లు పొందేందుకు ప్రధాని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’’ స్టాలిన్‌ పేర్కొన్నారు.

ఆ వైఖరి మానుకోవాలి

‘‘ఆలయంలోని నిధిని తస్కరించారని తమిళ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని ఎలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలతో తమిళనాడును అవమానిస్తున్నారు. దేశ నాయకుడంటే రాష్ట్ర ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించాలి. కానీ, ప్రధాని మాత్రం తన ద్వేషపూరిత ప్రసంగాలతో శతృత్వాన్ని సృష్టించాలని చూస్తున్నారు. అసలు ఆయనకు తమిళులపై ఇంత ద్వేషం ఎందుకు? ఇకనైనా ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను కించపరచడం ఆయన మానుకోవాలి’’ అని అన్నారు.

దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఒడిశాలో పర్యటించిన ప్రధాని మోదీ.. బీజేడీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వ హయాంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదని.. గత ఆరేళ్ల నుంచి రత్న భాండాగారం  తాళం చెవులు కనిపించడం లేదంటూ విమర్శించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్టాలిన్‌.. ప్రధానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని