Mithun Chakraborty: సినీనటుడు మిథున్‌ చక్రవర్తి రోడ్‌ షోపై రాళ్ల దాడి!

మిడ్నాపుర్‌లో సినీ నటుడు మిథున్‌ చక్రవర్తి పాల్గొన్న ఎన్నికల ప్రచార రోడ్‌ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు.

Published : 21 May 2024 20:26 IST

మిడ్నాపుర్‌: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) వేళ పశ్చిమబెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా సినీ నటుడు, భాజపా నేత మిథున్‌ చక్రవర్తి (Mithun Chakraborty) మిడ్నాపుర్ పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. మిడ్నాపుర్‌ లోక్‌సభ సీటు నుంచి బరిలో నిలిచిన భాజపా అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ జరగ్గా.. ఆయనకు ఏమీ కాలేదని పోలీసులు వెల్లడించారు.

మిడ్నాపుర్‌ కలెక్టరేట్‌ వద్ద మొదలైన రోడ్‌షో.. కేరనిటోల వైపు వెళ్తుండగా వందల మంది భాజపా మద్దతుదారులు నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మిథున్‌ చక్రవర్తి, అగ్నిమిత్ర ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. భాజపా శ్రేణులు వారిని ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమై సత్వరమే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్‌

భాజపా, టీఎంసీ మాటల దాడి

తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ దాడి చేశారని అగ్నిమిత్ర పాల్‌ ఆరోపించారు. భాజపాకు మద్దతు పెరుగుతోందనే భయంతోనే ఇలా చేస్తున్నారన్నారు. మిథున్ చక్రవర్తి వంటి దిగ్గజ నటుడిని అగౌరవపరిచే స్థాయికి దిగజారిపోతున్నారని మండిపడ్డారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందినవారే హింసను ప్రేరేపించారంటూ విరుచుకుపడ్డారు. భాజపా అభ్యర్థి చేసిన ఆరోపణల్ని తృణమూల్‌ కాంగ్రెస్  కొట్టిపారేసింది.  అగ్నిమిత్ర ఆరోపణల్ని టీఎంసీ అధికార ప్రతినిధి త్రినాంకూర్‌ భట్టాచార్య ఖండించారు. ఇలాంటి వికృత చర్యలను తాము విశ్వసించబోమని.. రోడ్‌షో ఫ్లాప్‌ అవడంతో భాజపానే ఇలాంటి డ్రామాలు చేస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని