Supriya Sule vs Sunetra Pawar: పవార్‌ కుటుంబంలో ‘పవర్‌’ కుస్తీ.. బారామతిలో వదినా-మరదళ్ల పోరు!

పవార్‌ కుటుంబంలో ఆసక్తికర పోరుకు తెర లేచింది. బారామతిలో సుప్రియ సూలె, సునేత్ర పవార్‌ పోటీ చేయబోతున్నారు.

Published : 31 Mar 2024 00:01 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆసక్తికర పోరుకు తెర లేచింది. పవార్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం.. అదే కుటుంబ సభ్యుల మధ్య పోరుకు వేదికైంది. ఈ స్థానం నుంచి శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలె పోటీ పడుతుండగా.. అజిత్‌ పవార్‌ భార్య సునేత్ర పవార్‌ కూడా అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దీంతో వదినా, మరదళ్ల మధ్య తొలిసారి ఎన్నికల పోరు జరగనుంది. ఈవిషయమై కొంతకాలంగా ఊహాగానాలు వెలుడుతున్నప్పటికీ.. అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన నేత సునీల్‌ టట్కరే అధికారికంగా దీన్ని ధ్రువీకరించారు.

55 ఏళ్లుగా బారామతి లోక్‌సభ సీటు పవార్‌ కుటుంబానిదే. తొలుత శరద్‌పవార్‌ ఆ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి సుప్రియా సూలె ఆ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత బారామతి స్థానం నుంచి అజిత్‌ పవార్‌ భార్యను బరిలో నిలుపుతారనే వార్తలు వచ్చాయి. తాజాగా శరద్‌ పవార్‌ పార్టీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. అక్కడికి కాసేపటికే అజిత్‌ పవార్‌ వర్గం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇది కుటుంబం మధ్య పోరు కాదని, సైద్ధాంతిక పోరుగా టట్కరే పేర్కొన్నారు.

ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో భాజపా, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మహావికాస్‌ కూటమి తరఫున ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని