Lok Sabha Polls: వదిన- మరదళ్ల సవాల్‌.. బారామతిలో నామినేషన్‌ వేసిన సుప్రియా, సునేత్ర

మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్‌ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది.

Updated : 19 Apr 2024 17:17 IST

పుణె: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల (Lok Sabha elections) పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటైన బారామతిలో పవార్‌ కుటుంబం నుంచి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతుండటం ఉత్కంఠగా మారింది. ఇదే సీటు నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన సుప్రియా సూలేతో, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ తలపడుతున్నారు.  చీలిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటి ప్రజల మద్దతు తమకే ఉందని చాటిచెప్పేందుకు రెండు వర్గాలూ ప్రయత్నిస్తుండటంతో ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మే 7న జరగనున్న ఎన్నికలకు సుప్రియ, సునేత్ర గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సీపీ వ్యవస్థాపకుడు, కేంద్రమాజీ మంత్రి శరద్‌పవార్‌ కుమార్తె సుప్రియాసూలే ఇప్పటివరకు వరుసగా మూడు సార్లు బారామతి నుంచి గెలుస్తూ వచ్చారు. అజిత్‌ తిరుగుబాటుతో ఈసారి ఎన్సీపీ-ఎస్‌పీ నుంచి నాలుగోసారి పోటీపడుతుండగా.. ఎన్సీపీ నుంచి అజిత్‌ పవార్‌ సతీమణి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

గురువారం సుప్రియా సూలే పుణెలోని కౌన్సిల్‌ హాలులో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నేతలు బాలా సాహెబ్‌ థోరాట్‌, విశ్వజీత్‌ కదంతో పాటు పలువురు నేతలు ఉన్నారు. మరోవైపు, సునేత్ర సైతం తన నామినేషన్‌ దాఖలు చేయగా.. ఆమె వెంట ‘మహాయుతి’ కూటమి నేతలైన సీఎం ఏక్‌నాథ్‌ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలేతో పాటు పలువురు ఉన్నారు. అయితే, అజిత్ పవార్‌ కూడా ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సునేత్ర నామినేషన్‌ ఏదైనా కారణంతో పరిశీలనలో తిరస్కరణకు గురైతే బ్యాకప్‌ ప్లాన్‌ కింద ఒక సెట్‌ నామినేషన్‌ వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్‌ వేయడానికి ముందు అజిత్‌ పవార్‌-సునేత్ర దంపతులు దగ్దుసేథ్‌ హల్వాయి గణపతి దేవాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్‌ వేసిన కీలక నేతలు

అనంతరం ఏర్పాటుచేసిన ప్రచార ర్యాలీలో సీఎం ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ..  బారామతిలో మార్పు అనివార్యమన్నారు. ఈసారి సునేత్ర పవార్‌ అనే నినాదం ఇచ్చారు. బారామతిలో కొత్త చరిత్ర సృష్టిస్తామని.. బారామతి కోడలు దిల్లీకి వెళ్లబోతున్నారని దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఈసందర్భంగా సునేత్ర మాట్లాడుతూ..  ప్రధాని నరేంద్రమోదీ చేసిన అద్భుతమైన పనుల్ని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, చంద్రయాన్ వంటి వాటిలో మోదీ కీలకపాత్ర పోషించారని.. అందుకే ఆయన ప్రజల మదిలో నిలిచిపోయారని కొనియాడారు.

దాదాపు ఐదు దశాబ్దాలుగా బారామతి లోక్‌సభ సీటు పవార్‌ కుటుంబానిదే. తొలుత శరద్‌పవార్‌ ఆ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి సుప్రియా సూలే ఆ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఎన్సీపీలో చీలిక తర్వాత బారామతి స్థానం నుంచి అజిత్‌ పవార్‌ భార్యను బరిలో దించారు. అయితే, ఇది కుటుంబం మధ్య పోరు కాదని, సైద్ధాంతిక పోరుగా నేతలు పేర్కొంటున్నారు. 

ఈసారి ఎన్నికల్లో మహారాష్ట్రలో భాజపా, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మహావికాస్‌ కూటమి తరఫున ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌ పోటీ చేస్తున్నాయి. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు ఎన్సీపీ 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. తాజాగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని