TDP-YSRCP: తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత

నామినేషన్‌ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated : 25 Apr 2024 16:02 IST

తిరుపతి: నామినేషన్‌ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి అభ్యర్థులు పులివర్తి నాని (తెదేపా), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి (వైకాపా) నామినేషన్‌ వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా మోహిత్‌రెడ్డితో పాటు ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కార్యాలయానికి రాగా.. కొద్ది సేపటికి పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి వరప్రసాదరావు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో మోహిత్‌రెడ్డి వెనుక ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపా జెండాలను కింద వేసి తొక్కారు. దీనిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. సమీపంలో మురుగుకాల్వ కల్వర్టు నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసిరారు. తెదేపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాదాపు రెండుగంటల పాటు ఘర్షణ జరిగింది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, ప్రదర్శనకు ఒకే సమయంలో పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు