Chandrababu:: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వచ్చాయని, జెండాలు మూడైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 26 Mar 2024 16:56 IST

కుప్పం: జగన్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్‌ కేలండర్‌ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. ఐదేళ్లుగా ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా.. ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలనేదే తన కోరిక అని  అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో చంద్రబాబు సమావేశమయ్యారు.ఏపీలో గ్రూప్‌-1 పోస్టులను ఇష్టారీతిన కావాల్సిన వారికి ఇచ్చారని  ఆరోపించారు.

‘‘వైకాపా నాయకులు సర్వే నంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారు. కుప్పంలోనే నన్ను బెదిరిస్తున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేస్తున్నారు. మద్యం, గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని అరికడతాం. యువతలో సామాజిక స్పృహ, సామాజిక భాద్యత ఉండాలి. రాష్ట్రాన్ని కాపాడాలనే మూడు పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయి. జెండాలు మూడు.. అజెండా మాత్రం ఒక్కటే. రాష్ట్రంలో పాలనను మళ్లీ గాడిన పెట్టే బాధ్యత నాది. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో పడితే ప్రమాదకరం. పారదర్శకంగా జరగాల్సిన టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ తీసుకొస్తాం. అన్ని మండల కేంద్రాల్లో వర్క్‌ స్టేషన్లు నిర్మిస్తాం. మేం వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్‌ తయారు చేస్తాం. వాలంటీర్లు నెలకు రూ.30వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తాం.’’ అని చంద్రబాబు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని