TDP: ఎన్నికల్లో ఓటమి భయంతోనే కొత్త నాటకానికి తెర: అచ్చెన్నాయుడు

ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్‌ కొత్త నాటకానికి తెరతీశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Updated : 14 Apr 2024 15:38 IST

టెక్కలి: ఎన్నికల్లో వైకాపా ఓడిపోతుందని తెలిసే జగన్‌ కొత్త నాటకానికి తెరతీశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ ఘటన ప్రణాళిక ప్రకారం జరిగిందేనని ఆరోపించారు. వివేకా హత్య, కోడికత్తి తరహాలో.. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

‘‘జగన్ పర్యటనలో 3గంటల పాటు విద్యుత్‌ లేపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు? రోప్‌ పార్టీ ఏమైంది? నాలుగు రోజుల్లో సంచలనాత్మక ఘటన జరుగుతుంది. దీని వల్ల ఎన్నికల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. అని 4రోజుల క్రితం వైకాపా నేత ట్వీట్‌ చేశారు. అతను చెప్పినట్టే సరిగ్గా నాలుగు రోజులకే ప్రణాళిక ప్రకారం ఈ ఘటన జరిగింది’’ అని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

 అతి చిన్న స్టేజ్‌ డ్రామా: వర్ల రామయ్య

సీఎం జగన్‌పై రాయి పడటం.. అతి చిన్న స్టేజ్‌ డ్రామా అని తెదేపా నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. ‘ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే వైకాపా నేతలు ధర్నా చేశారు. అప్పటికప్పుడు  ప్లకార్డులు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని కొందరు వైకాపా నేతలు, పోలీసులకు ముందే తెలుసన్నారు. ‘‘ కరెంట్‌ పోయిన వెంటనే భద్రతా సిబ్బంది చుట్టూ రక్షణ కల్పిస్తారు. కానీ, ముఖ్యమంత్రి ఒక్కరినే నిలబెట్టి... సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు కూర్చున్నారు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు, లోకేశ్‌పై ఆరోపణలు చేశారు. హత్యాయత్నం చేశాడని ఎవరో ఒకరిని తీసుకొస్తారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి’’ అని వర్ల రామయ్య అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని