TDP: పింఛన్ల పంపిణీపై జగన్‌ది వికృత క్రీడ: తెదేపా

తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిందని వైకాపా నేతలు ప్రచారం చేస్తున్నారని తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. నగదును ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది.

Published : 01 Apr 2024 12:22 IST

అమరావతి: తెదేపా వల్లే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ ఆగిందంటూ వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెదేపా ఆగ్రహం వ్యక్తం చేసింది. నగదును ఇంటింటికీ వెళ్లి ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు నక్కా ఆనంద్‌బాబు, కన్నా లక్ష్మీనారాయణ, దేవినేని ఉమా, తెనాలి శ్రవణ్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌ మీడియాతో మాట్లాడారు. పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వైకాపా రాజకీయం చేస్తోందని విమర్శించారు. వృద్ధులు, దివ్యాంగులకు పంపిణీని కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లంతా తమ వాళ్లే అని వైకాపా నేతలే చెప్పారని గుర్తుచేశారు. అధికార పార్టీకి రాజకీయ లబ్ధి చేకూరేలా వ్యవహరించవద్దని ఎన్నికల సంఘాన్ని కోరారు. 

‘‘మాపై దుష్ప్రచారం చేసేందుకు కావాలనే కుట్రలు చేస్తున్నారు. పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను వినియోగించాల్సిన అవసరం లేదు. తమకు న్యాయం చేయలేదని వైకాపా ప్రభుత్వంపై వాలంటీర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఇది రాజకీయ అంశం కాదు.. జగన్‌ ఆడుతున్న వికృత క్రీడ. ఈ ప్రభుత్వం ఇంకా పంచాయతీ ఖాతాల్లోనే డబ్బు వేయలేదు. నిధులు లేక జగన్‌ ఇలాంటి రాజకీయాలు ఆడుతూ తెదేపాపై బురద చల్లుతున్నారు. పంచాయతీ, రెవెన్యూ సిబ్బందితోనూ పింఛన్ల పంపిణీ చేయవచ్చు’’  అని తెదేపా నేతలు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని