TDP: పింఛన్ల పంపిణీలో జాప్యం.. సీఎస్‌కు తెదేపా నేతల ఫిర్యాదు

పింఛన్ల పంపిణీపై సీఈవో ఉత్తర్వులు ఇచ్చారని, ఈసీ ఆదేశాలను చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

Published : 01 Apr 2024 14:04 IST

అమరావతి: పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఉత్తర్వులు ఇచ్చారని.. ఆ ఆదేశాలను తెదేపా అధినేత చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎస్‌ జవహర్‌ రెడ్డికి తెదేపా నేతలు ఫిర్యాదు చేశారు. సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని కోరారు. అనంతరం తెదేపా నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనంబాబుతో కలిసి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి ఇవ్వాలన్నారు. తెదేపాకు చెడ్డపేరు తేవాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 5 లోగా పంపిణీ పూర్తి చేయాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తికి సీఎస్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

ఈసీకి కనకమేడల లేఖ

మరోవైపు పింఛన్ల పంపిణీపై ఈసీకి తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ లేఖ రాశారు. పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం సచివాలయ సిబ్బందిని వినియోగించాలని కోరారు. ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు.

‘‘వాలంటీర్లను వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంతో ఈసీకి సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ ) సభ్యులు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి కూడా వాలంటీర్లు పార్టీకి పని చేయాలని ఆదేశించారు. ఇవన్నీ ఈసీ దృష్టికి వెళ్లడంతో పింఛన్ల పంపీణీకి వారిని దూరం పెట్టమని ఆదేశించింది. దీన్ని ఆసరాగా తీసుకొని సజ్జల మీడియా సమావేశం పెట్టి తెదేపా, చంద్రబాబుపై బురద చల్లే ప్రయత్నం చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారు.. పార్టీ సలహాదారు కాదు. అబద్ధాలు చెబుతున్న ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు ముందే ప్రభుత్వ ఖజానాలోని సంక్షేమ పథకాల డబ్బులను అనుయాయులకు చెల్లించారు. దీంతో సర్కారు దగ్గర నిధులు లేవు. దీనిపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది.’’ అని కనకమేడల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని