TDP: అధికారం కోల్పోయే సమయంలోనూ జగన్‌ విధ్వంస పాలన: ప్రత్తిపాటి

అధికారం కోల్పోయే సమయంలోనూ సీఎం జగన్.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు.

Updated : 01 Mar 2024 16:36 IST

అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్‌ను 16 గంటల పాటు ఏవేవో ప్రాంతాల్లో తిప్పారని ఆరోపించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ ఎన్ని కుతంత్రాలు చేసినా బెదిరింపులకు భయపడేది లేదన్నారు. తనకు న్యాయం, ధర్మంపై విశ్వాసం ఉందని.. అరాచకాన్ని నమ్ముకున్న జగన్‌ను అవే తొక్కిపెడతాయన్నారు.

‘‘ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (ఏపీ డీఆర్‌ఐ)ఎవరి ఆధీనంలో ఉంది? ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసమే ఈ దర్యాప్తు సంస్థ పనిచేస్తోందా? ఇప్పటివరకు వారు పెట్టిన కేసులన్నీ తెలుగుదేశం నేతలపైనే. తెదేపా-జనసేన సభలు విజయవంతం అవుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. వ్యవస్థలను విచ్ఛిన్నం చేసి.. వికృత చేష్టలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. జగన్ రెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు మా ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవు’’ అని ప్రత్తిపాటి అన్నారు.

మాజీ మంత్రి కొల్లురవీంద్ర మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదనే భయంతోనే జగన్ అక్రమ కేసులు పెట్టి ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు. తన దోపిడీ, అక్రమాల నుంచి జగన్ తప్పించుకోలేరు. పరదాల చాటున ప్రజల వద్దకు వెళ్లే సీఎం.. తెదేపా నేతలను భయపెట్టలేరు. శరత్‌పై పెట్టిన అక్రమ కేసు తక్షణమే ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని