Chandrababu: తిక్కలోడికి ఓటేస్తే రాజధాని లేకుండా చేశారు: చంద్రబాబు

2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 13 Apr 2024 17:44 IST

తాడికొండ: 2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.

‘‘రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి.. ఆ జిల్లాల్లో వైకాపాకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ప్రజల సంబరాలతో పాటు.. జగనాసుర వధ కూడా జరుగుతుంది. జగన్‌ పోవాలి.. ప్రజలు గెలవాలి.

వైకాపా ప్రభుత్వంపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది..

వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లింది. ఆ పార్టీ నేతలకు కమిషన్లు ఇవ్వలేక రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోయాయి. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్నారు.. చేశారా?ఉద్యోగులకు పీఆర్‌సీ, డీఏలు ఇవ్వలేదు. బడికి రంగులు వేస్తే విద్యా వ్యవస్థ మారిపోతుందా? రూ.కోట్లు ఖర్చు పెట్టినా జగన్ సభలకు జనం రావడం లేదు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ దిగిపోవాలి. రాష్ట్ర ప్రజలకు వైకాపాపై కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది. నేను సీఎంగా ఉంటే పోలవరం ఈ పాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తి చేశాక నదుల అనుసంధానం చేద్దామనుకున్నా. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది. జూన్‌ 4న ఇక్కడ విజయోత్సవాలు చేసుకుందాం. నేను, పవన్‌, మోదీ కలిసి అమరావతిని అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు భరోసా కల్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని