Chandrababu: యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు

యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Updated : 27 Mar 2024 17:00 IST

పుత్తూరు: యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక .. 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.‘‘చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్‌. ఆయనో అబద్ధాల కోరు. బోగస్‌ సర్వేలు చేయిస్తారు. రాజకీయాలకు పనికిరాడు. పేదల మనిషి ఎవరో.. పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. మేం ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు.  అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుంది. ఐదేళ్ల ప్రజల ఆవేదన.. వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలి.

పేదల కష్టాలు తెలియని వ్యక్తి జగన్‌..

మేం ఉన్నప్పుడు ఐదేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పెంచలేదు. పేదల కష్టాలు ఏమాత్రం తెలియని వ్యక్తి జగన్‌. రూ.60ల మద్యాన్ని రూ.200లకు అమ్ముతున్నారు. ఈ ఐదేళ్లలో మీ ఆదాయం పెరిగిందా.. తగ్గిందా? పేదలను నిరుపేదలుగా మార్చిన పెత్తందారు జగన్‌. పేదల జీవితాల్లో వెలుగులు చూపించే బాధ్యత నాది. మహిళలను వేధించిన వారు బాగుపడినట్టు ఎక్కడా లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆడబిడ్డ నిధి ఇస్తాం. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తాం. అన్నదాత కింద రైతుకు ఏటా రూ.20వేలు ఇస్తాం. బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తాం. మేం వచ్చాక ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెరగవు. చేనేత కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ తెస్తాం. నగరిలో ప్రతి ఎకరాకు నీరిచ్చే బాధ్యత నాది’’ అని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని