TDP: జగన్‌రెడ్డి అండతోనే పిన్నెల్లి సోదరుల అరాచకం

ముఖ్యమంత్రి జగన్‌ అండ చూసుకొనే మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలు తారస్థాయికి చేరాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు.

Published : 30 May 2024 04:28 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపైనే 51 దాడులు 
మాచర్ల నుంచి వారిని బహిష్కరించాలి 
‘పిన్నెల్లి పైశాచికత్వం’ పుస్తకావిష్కరణలో తెదేపా నేతల ధ్వజం 

‘పిన్నెల్లి పైశాచికం’ పుస్తకాన్ని మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరిస్తున్న పారా కిషోర్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని ఉమా,  బుద్ధా వెంకన్న, పి.అశోక్‌బాబు, పి.మాణిక్యరావు, ధారూనాయక్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ అండ చూసుకొనే మాచర్ల నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరాచకాలు తారస్థాయికి చేరాయని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే లక్ష్యంగా 51 దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, దోపిడీలతో పాటు పిన్నెల్లి సోదరులు దేవతా విగ్రహాల్ని సైతం దొంగిలించేవారని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్లలో 8 హత్యలు, రూ.2 వేల కోట్ల దోపిడీ, 79 దాడులు.. ఇలా వారి దుర్మార్గం సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేస్తే ఇంత, హత్య చేస్తే ఈ పదవి అని వారు వేలంపాటలు పెడతారని, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెదేపా బృందంపై దాడి చేసిన తురకా కిశోర్‌ను ఇలానే మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ను చేశారని విమర్శించారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలు, దోపిడీ, దుర్మార్గాలపై ‘పిన్నెల్లి పైశాచికత్వం’ పేరుతో రూపొందించిన 28 పేజీల పుస్తకాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధారూనాయక్, హైకోర్టు న్యాయవాది పారా కిషోర్‌లు బుధవారం ఆవిష్కరించారు. తక్షణం పిన్నెల్లి సోదరుల్ని మాచర్ల నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పాల్వాయిగేటులో ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి.. దాడి వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ చేయాలంటూ వైకాపా నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు.

గ్రానైట్‌ లారీల నుంచే రూ.1,200 కోట్ల కమిషన్‌: ‘ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా తెలంగాణ వెళ్లే గ్రానైట్‌ లారీల నుంచే రామకృష్ణారెడ్డి రూ.1,200 కోట్లు దోచుకున్నారు. కంకర ద్వారా రూ.40 కోట్లు కొల్లగొట్టారు. ఎవరి మీదయినా కోపమెస్తే గ్రానైట్‌ రాళ్లతో కొట్టి చంపడం ఆయనకు అలవాటు. మాచర్లలో సీసీ రోడ్లు వేసినా, కాలువల మరమ్మతులు చేసినా ఆయనకు 5 శాతం కమిషన్‌ ఇవ్వాలి. రూ.10 లక్షల విలువైన పనిచేస్తే రూ.50 వేలు, రైతులకు పాసుపుస్తకం రావాలంటే రూ.15 వేలు లంచం ఇవ్వాలి. ఇదేంటని ప్రశ్నిస్తే తన అనుచరులతో దాడులు చేయిస్తారు’ అని బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. భక్తవత్సలరెడ్డి లాంటి కొందరు పోలీసులు పిన్నెల్లి అనుచరుల్లా మారారని పారా కిషోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాచర్లలో తమపై జరిగిన దాడి కేసు విచారణలో పోలీసుల వైఫల్యంపై హైకోర్టులో కేసు వేశామని, త్వరలోనే అది విచారణకు రానుందని చెప్పారు. పిన్నెల్లి రోడ్డుపైకి వస్తే ప్రజలు బందిపోటు దొంగల్ని కొట్టినట్టు కొడతారని పిల్లి మాణిక్యరావు అన్నారు. మాచర్లలో పోలీసింగ్‌ పూర్తి నిర్వీర్యమైందని ధారూనాయక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని