Petrol Prices: పెట్రోల్‌, డీజిల్‌పై ఆ సుంకాలు ఎత్తివేయండి..!

ఇంధనంపై వసూలు చేస్తోన్న అదనపు సర్‌ఛార్జ్, సుంకాలను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఊరట కలిగించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది.

Updated : 15 Nov 2021 01:43 IST

కేంద్రానికి సీపీఎం పొలిట్‌ బ్యూరో డిమాండ్‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై భారీ సుంకాలు వసూలు చేస్తోన్న కేంద్ర ప్రభుత్వం.. వాటిని తగ్గించామని పేర్కొనడం హాస్యాస్పదమేనని సీపీఎం విమర్శించింది. ముఖ్యంగా పెట్రోల్‌పై రూ.33, డీజిల్‌పై రూ.32 ఎక్సైజ్‌ సుంకాన్ని వసూలు చేస్తున్నప్పటికీ కేవలం కంటితుడుపు చర్యగా తగ్గించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఇంధన ధరల పెరుగుదలతో సతమతమవుతోన్న సామాన్య ప్రజలకు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించడం వల్ల ఒరిగే ప్రయోజనం శూన్యమని స్పష్టం చేసింది.

‘ఇంధన ధరలపై సర్‌ఛార్జ్ పేరుతో రూ.74,350 కోట్లు, సెస్‌ పేరుతో రూ.1,98,000 కోట్ల అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం వసూలు చేస్తూనే ఉంది. వీటికితోడు మరో 15వేల కోట్లను ఇతర రూపాల్లో సుంకాలను వసూలు చేస్తోంది. ఇలా రాష్ట్రాలతో పంచుకోలేని మొత్తం రూ.2.87లక్షల కోట్ల సుంకాన్ని కేంద్రప్రభుత్వం ఆర్జిస్తోంది’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇంధనంపై వసూలు చేస్తోన్న అదనపు సర్‌ఛార్జ్, సుంకాలను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఊరట కలిగించాలని డిమాండ్‌ చేసింది.

దేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న వేళ.. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయమంటూ కేంద్రప్రభుత్వం చెప్పడం క్రూరమైన నిర్ణయమని సీపీఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ నేపథ్యంలో హక్కుల కోసం రైతులు చేస్తోన్న ఉద్యమానికి ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చింది. మరోవైపు దేశంలో మైనారిటీలపై దాడులు పెరగడం ఆందోళనకరమని అభిప్రాయపడింది. ఇక సరిహద్దులో బీఎస్‌ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని తప్పుబట్టిన సీపీఎం, అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆందోళన వ్యక్తంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని