Anaparthi: వైకాపా ఎమ్మెల్యేకు సవాల్‌.. నల్లమిల్లి నివాసం వద్ద ఉద్రిక్తత

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Updated : 01 Mar 2024 15:44 IST

అనపర్తి: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో భారీగా పోలీసులు మోహరించారు. తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి, అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని.. 109 అంశాలపై చర్చకు సిద్ధమా? అని గురువారం నల్లమిల్లి సవాల్‌ విసిరారు. 175 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణరెడ్డి.. చర్చకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే ఇంటికి నల్లమిల్లి బయల్దేరారు. అయితే పోలీసులు రామకృష్ణారెడ్డిని రామవరంలోనే నిలువరించారు. వాహనం చుట్టూ చేరి ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకున్నారు. బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు-తెదేపా శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు: నల్లమిల్లి

పోలీసుల తీరుపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. తనతో మాట్లాడతామని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. హైస్కూల్‌ ఆస్తిని కబ్జా చేశారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైకాపా నేతలు ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి రూ.15కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని