Nitish Kumar: 2024లో భాజపాకు ఓటేస్తే విధ్వంసం కొనితెచ్చుకున్నట్లే: నీతీశ్‌

Nitish Kumar Attack on BJP: వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చినట్లే అవుతుందని నీతీశ్‌ కుమార్‌ అన్నారు. ఆ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు.

Published : 14 Apr 2023 20:34 IST

పట్నా: భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుపై జేడీయూ నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేస్తే విధ్వంసాన్ని కొని తెచ్చుకున్నట్లేనని చెప్పారు. ప్రస్తుతం భాజపాకు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యం కోసం తాను పనిచేస్తున్నట్లు చెప్పారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా జేడీయూ కార్యాలయంలో ఆయన పార్టీ కార్యకర్తలనుద్దేశించి శుక్రవారం మాట్లాడారు.

‘‘విపక్షాల ఐక్యత కోసం నేను పనిచేస్తున్నా. నేనైతే ప్రధాని మంత్రి పదవికి పోటీలో లేను. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విపక్షాలను ఒక తాటిపైకి వస్తున్నాయి. ప్రస్తుతానికి నా ముందున్న ఒకే ఒక్క లక్ష్యం భాజపాను మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైతే భాజపాకు ఓటు వేస్తారో వారు తమతో పాటు దేశానికీ విధ్వంసాన్ని కొనితెచ్చినట్లే. కేంద్ర రాష్ట్రాల్లో సుపరిపాలన కావాలంటే మాకు (విపక్షాలకు) ఓటు వేయాలి’’ అని నీతీశ్‌ అన్నారు.

విపక్షాల ఐక్యం చేసే దిశగా కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల నేతలతో తాను భేటీ అయినట్లు నీతీశ్‌ వెల్లడించారు. సమావేశాలన్నీ సానుకూల వాతావరణంలో నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పర్యటించి ఇతర పార్టీ నేతలతోనూ మాట్లాడనున్నానని చెప్పారు. మతపరంగా సమాజాన్ని చీల్చడం తప్ప ఈ దేశానికి భాజపా చేసిందేమీ లేదన్నారు. అందుకే ఆ పార్టీ చరిత్రను మార్చాలనకుంటోందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌తో కలిసి రెండ్రోజుల పాటు దిల్లీలో పర్యటించిన నీతీశ్‌.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని