Mimi Chakraborthy: పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీకి ఝలక్‌.. ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.

Updated : 15 Feb 2024 20:19 IST

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ, నటి మిమి చక్రవర్తి (Mimi Chakraborty) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వంపై మిమి చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకు రెండురోజుల ముందు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పదవులకు ఆమె రాజీనామా చేశారు.

సందేశ్‌ఖాలీలో ఉద్రిక్తత.. టీఎంసీ ఎంపీ ఫొటోషూట్‌పై భాజపా విమర్శలు

‘‘జాదవ్‌పుర్‌ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాను. ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమా పరిశ్రమ నుంచి వచ్చానని కొందరు నా గురించి హేళనగా మాట్లాడారు. స్థానిక నాయకుల్లో కొంతమందిని నేను కలవలేకపోయి ఉండొచ్చు. అంతమాత్రాన వారితో నేను అమర్యాదగా వ్యవహరించినట్లు కాదు. రాజకీయాల్లో నైతికత ఏంటనేది నాకు అర్థం కావడం లేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు మిమి చక్రవర్తి రాజీనామాను మమత బెనర్జీ ఆమోదించలేదని సమాచారం. 2019 ఎన్నికల్లో జాదవ్‌పుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె.. భాజపా (అనుపమ్‌ హజ్రా), సీపీఎం (రంజన్‌ భట్టాచార్య) తరఫున పోటీ చేసిన సీనియర్‌ నాయకులను ఓడించి విజయం సాధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని