TDP-JANASENA: బ్రో.. మీరు ఎవరి తాలూకా!.. వైకాపాపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయకేతనం ఎగురవేశాక సామాజిక మాధ్యమాల్లో వైకాపాపై ట్రోల్స్‌ బాగా పెరిగాయి.

Updated : 05 Jun 2024 08:02 IST

మూడ్‌ ఆఫ్‌ ఆంధ్ర.. ‘హలో ఏపీ.. బై బై వైసీపీ’
సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడిదే పెద్ద చర్చ

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి తిరుగులేని విజయకేతనం ఎగురవేశాక సామాజిక మాధ్యమాల్లో వైకాపాపై ట్రోల్స్‌ బాగా పెరిగాయి. ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇచ్చిన ‘హలో ఏపీ.. బై బై వైసీపీ’ నినాదం ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఫలితాల తరువాత కూడా దాన్ని విపరీతంగా గుర్తు చేసుకున్నారు. ఈ నినాదం ఎన్నికల్లో కూటమి గెలవడానికి దోహదపడిందని చర్చించుకుంటున్నారు. వైకాపా నాయకులు విర్రవీగుతూ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని, ప్రస్తుత ఫలితాలను పోల్చుతూ ఓ రేంజిలో నెటిజన్లు ఆడుకున్నారు. ఎన్డీయే గెలిచిన అంకెలను చూపిస్తూ వాటి కింద పలు సభల్లో జగన్‌ ప్రదర్శించిన విచిత్రమైన హావభావాలతో వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. సోమవారం వరకు.. ‘అధికారం మాదే.. వైనాట్‌ 175..’ అంటూ అతిశయోక్తులకు పోయిన జగన్‌ బృందం ఇప్పుడు ముఖం చెల్లక ట్రోలర్ల దెబ్బకు మూగబోయింది. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలను బ్లాక్‌ చేసుకున్నారు. వైకాపా ఘోర పరాజయాన్ని సూచిస్తూ పలువురు యువకులు ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను ద్విచక్రవాహనాలకు కట్టి ఊరంతా ఈడ్చుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

వైకాపాను అధఃపాతాళానికి తొక్కుతా..

తమ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్కరినీ గెలిపించుకున్న పవన్‌కల్యాణ్‌.. ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఓ సభలో చేసిన ‘జగన్‌ గుర్తుంచుకో.. నీ పార్టీని అథ:పాతాళానికి తొక్కుతా’ అంటూ చేసిన శపథం వీడియోను ఫలితాల అనంతరం ఆయన అభిమానులు షేర్‌ చేస్తూ గుర్తు చేసుకున్నారు. ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ బహుశా ఈ వాక్యం తెలియని నెటిజన్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. సోషల్‌మీడియాలో ‘బ్రో.. మీరు ఎవరి తాలూకా..’ ఇప్పుడు ఇదే సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ. ఎందుకంటే ఫలితాలకు ముందు ‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’, ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి అబ్బాయి రామ్‌చరణ్‌ తాలూకా’ అంటూ వాహనాల నంబరు ప్లేట్లకు స్టిక్కర్లు వేసుకుని పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా నిలుస్తూ అభిమానులు తెగ వైరల్‌ చేశారు. అడపాదడపా అక్కడక్కడ ‘డిప్యూటీ సీఎం తాలూకా’ అంటూ వంగా గీతకు ఒక్కరిద్దరు మద్దతుగా స్టిక్కర్లు వేసుకున్నా పవన్‌ అభిమానుల ధాటికి కొట్టుకుపోయారు. 

మనల్ని ఎవడ్రా ఆపేది?

‘2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారంటూ వైకాపా నేతలు కారుకూతలు కూశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబెట్టిన ప్రతి ఒక్కరినీ మా నాయకుడు గెలిపించుకున్నారు’ అంటూ పలువురు పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది? సర్దార్‌ అన్నకు అడ్డెవరన్నా’ అంటూ సాగే పాటలు, సినిమా డైలాగులు ట్రెండింగ్‌ అయ్యాయి. అరాచక శక్తులు, ప్రభుత్వంపై పదేళ్లుగా చేసిన పోరాటం, బాధ, వ్యక్తిగత విమర్శలు, తారాస్థాయికి చేరిన దూషణలన్నింటికీ గూబగుయ్యిమనేలా సమాధానం చెప్పారంటూ పోస్టులు పెట్టారు. ఓ సినిమాలో పవన్‌కల్యాణ్‌ ‘మీకు అన్నీ ఉన్నాయి. డబ్బు, పేరు, అధికారం, తొక్కా, తోటకూర.. కానీ లేనిది మాత్రం భయం. అది నేను మీకు త్వరలోనే చూపిస్తా..’ అంటూ చెప్పిన డైలాగ్‌ను పోస్టు చేస్తూ ఈ ఫలితాలతో జగన్‌కు దిమ్మదిరిగేలా భయం చూపించారంటూ ఎద్దేవా చేశారు. 

తట్టా బుట్టా సర్దుకుని ‘సిద్ధం’

ఘోర పరాజయం తర్వాత వైకాపా నేతలు తట్టాబుట్టా సర్దుకుని కొంతమంది విదేశాలు, చాలా మంది కారాగారానికి వెళ్లడానికి సిద్ధం కావాలంటూ పోస్టులు పెట్టారు. ‘ఇన్ని రోజులూ కామెడీ చేస్తూ మమ్మల్ని సంతోషపరిచిన ‘కోడిగుడ్డు మంత్రి’, ‘ట్విన్‌ సిటీస్‌ ఎంపీ’, ‘సంబరాల రాంబాబు’లాంటి వైకాపా నేతలకు కృతజ్ఞతలు.. ఇక సెలవు’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని