Uddhav Thackeray: మణిపుర్‌ ఫైల్స్‌ vs కిచిడీ ఫైల్స్‌.. ‘మహా’ రాజకీయాల్లో మాటల యుద్ధం!

భాజపాను ‘భ్రష్ట్‌ (అవినీతి) జనతా పార్టీ’గా పేర్కొన్న ఉద్ధవ్‌ ఠాక్రే.. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీ కళంకితులను స్వాగతిస్తోందని ఆరోపించారు.

Published : 31 Mar 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల బాండ్ల వివరాలతో భాజపా (BJP) అసలు స్వరూపం బయటపడిందని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) ఆరోపించారు. భాజపాను ‘భ్రష్ట్‌ (అవినీతి) జనతా పార్టీ’గా పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌, నవీన్‌ జిందాల్‌ వంటి కళంకితులను స్వాగతిస్తోందని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సభలో పాల్గొనేందుకు దిల్లీ వచ్చిన ఠాక్రే ఈ మేరకు మాట్లాడారు. మరోవైపు ఆయన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలదళం.. ఉద్ధవ్‌ పాలనలోని అవినీతిని వెలికి తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

‘‘వాజ్‌పేయీ హయాం నాటి భాజపా భిన్నంగా ఉండేది. అది సిద్ధాంతాలపై పనిచేసేది. ఇప్పుడు అవినీతిపరుల వెంట ఉంది. ఎన్నికల బాండ్ల వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు’’ అని ఉద్ధవ్‌ ఆరోపించారు. వీడీ సావర్కర్‌పై ఇటీవల విడుదలైన సినిమా చూసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి థియేటర్ బుక్ చేస్తానని దేవేంద్ర ఫడణవీస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మణిపుర్‌కు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ‘మణిపుర్‌ ఫైల్స్‌’ అనే సినిమా తీసేందుకు బాలీవుడ్ నిర్మాతను సంప్రదించాలని ఎద్దేవా చేశారు.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ లేకుండా భాజపా 400 దాటడం అసాధ్యం: రాహుల్‌ గాంధీ

ఒకవేళ ఠాక్రే ప్రభుత్వపు అవినీతిపై ఫడణవీస్‌ సినిమాలు తీస్తే.. వాటికి కిచిడీ ఫైల్స్‌, కొవిడ్‌ బాడీబ్యాగ్‌ ఫైల్స్‌గా పేర్లు పెట్టాల్సి ఉంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బావన్‌కులే పేర్కొన్నారు. ‘రూ.100 కోట్ల రికవరీ ఫైల్స్‌’ సినిమాకు స్ర్కిప్ట్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా సమయంలో ప్రజలకు కిచిడీ పంపిణీ, కొవిడ్ మృతుల బాడీ బ్యాగ్‌ల కొనుగోలులో అక్రమాలు, కాంట్రాక్టుల్లో కమీషన్‌ వంటి అక్రమాల్లో శివసేన (యూబీటీ) హస్తం ఉందని ఆరోపించారు. రెండున్నరేళ్లు ఇంటినుంచే పాలించిన ఉద్ధవ్‌.. ఎన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు చేసినా రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో ఆయనకు సరైన జవాబు ఇస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని