Rajnath Singh: తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్‌ జవాబు చెప్పాలి: రాజ్‌నాథ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలో నిర్వహించిన భాజపా జన గర్జన బహిరంగ సభలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. అధికార భారాసపై విమర్శలు గుప్పించారు. 

Updated : 16 Oct 2023 14:59 IST

జమ్మికుంట: రాణి రుద్రమదేవి, కుమురంభీమ్‌ లాంటి ఎంతో మంది వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. 1984లో భాజపా రెండు లోక్‌సభ స్థానాల్లో గెలిస్తే.. తెలంగాణ భాజపా నుంచి జంగారెడ్డి ఎన్నికయ్యారని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటలో నిర్వహించిన భాజపా జనగర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘‘27 ఏళ్లుగా గుజరాత్‌లో భాజపా అధికారంలో ఉంది. అభివృద్ధికి రోల్‌ మోడల్‌గా గుజరాత్‌ నిలిచింది. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. స్వరాష్ట్ర సాధన కోసం కేవలం కేసీఆర్‌ ఒక్కరే పోరాటం చేయలేదు. రాష్ట్ర సాధన కోసం భాజపా కూడా పోరాటం చేసింది. కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది. ఆయనకు కుటుంబమే తొలి ప్రాధాన్యత. కేసీఆర్‌ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారు. తెలంగాణ నెంబర్‌ 1గా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు.

భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ అభినందించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికలో కేసీఆర్‌ స్వయంగా ప్రచారం చేపట్టినా.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టినా ఉపఎన్నికలో రాజేందర్‌ను ఓడించలేకపోయారని అన్నారు.  ‘‘ యువతకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని ప్రశ్నిస్తున్నా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైంది? పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని కేసీఆర్‌ ప్రభుత్వం యువతకు సమాధానం చెప్పాలి. కేవలం భారాస అనుచరగణానికే దళిత బంధు అందింది. రామజన్మభూమి కోసం భాజపా ఉద్యమించింది. జనవరి 26న అయోధ్యలో భవ్య రామమందిర కల సాకారం చేయబోతున్నాం. 370 అధికరణాన్ని తొలగించి జమ్ముకశ్మీర్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం తీసుకొచ్చాం. భాజపా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతుంది’’ అని రాజ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా?: ఈటల

ప్రస్తుతం ఏ పథకం కావాలన్నా భారాసలోకి రమ్మంటున్నారని ఈటల రాజేందర్‌ విమర్శించారు. ‘‘ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నన్ను కమలాపురం ఓటర్లు 25 వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశా. మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌లో అనేక పనులు చేశా. హాస్టల్‌లో విద్యార్థుల కష్టాలు నాకు తెలుసు. నేను మంత్రిని అయ్యాక హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చా. వైద్యశాఖ మంత్రిని అయ్యాక ఆస్పత్రుల్లో వసతులు పెంచా. హైదరాబాద్‌లో మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్‌కు నచ్చలేదు. సమ్మె చేసిన 1,700 మందిని ఉద్యోగాల నుంచి కేసీఆర్‌ తొలగించారు. ఉద్యమాల గడ్డగా పేరున్న ఇందిరా పార్కులో ధర్నాలు నిషేధించారు. వీఆర్‌ఏలకు నేను మద్దతివ్వడం కేసీఆర్‌కు నచ్చలేదు. హుజూరాబాద్‌లో నన్ను ఓడించేందుకు కేసీఆర్‌ అనేక కుట్రలు చేశారు. ప్రజల గుండెల్లో స్థానం ఉన్న వ్యక్తిని ఎవరైనా ఓడించగలరా? 2021లో హుజూరాబాద్‌ ప్రజలు గెలిచారు. భారాస వందల కోట్లు ఖర్చు పెట్టినా నేనే గెలిచా. ఈసారి భాజపాను ప్రజలు ఆశీర్వదించాలి’’ అని ఈటల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని