Jagdeep Dhankhar: రాజ్యాంగ పదవులను గౌరవించండి.. రాజస్థాన్‌ సీఎంకు ఉప రాష్ట్రపతి సూచన

తన పర్యటనలను రాజకీయం చేయడం తగదని ఉప రాష్ట్రపతి (Vice President) జగ్‌దీప్‌ ధన్‌ఖఢ్‌ (Jagdeep Dhankhar) అన్నారు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ పదవులను గౌరవించాలని హితవు పలికారు. 

Published : 06 Oct 2023 22:35 IST

జైపుర్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉప రాష్ట్రపతి (Vice President) జగ్‌దీప్‌ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తరచూ రాజస్థాన్‌ (Rajasthan) రాష్ట్రానికి ఎందుకొస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ (Ashok Gehlot) ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి స్పందించారు. లక్ష్మణ్‌గఢ్‌లోని మోడీ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రసంగిస్తూ రాజ్యాంగ పదవులను గౌరవించాలని సీఎంకు సూచించారు. ‘మీరు మళ్లీ మళ్లీ ఎందుకు ఇక్కడకు వస్తున్నారని కొందరు అంటున్నారు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ పదవులపై ఇలా వ్యాఖ్యానిస్తారని నేను ఊహించలేదు. రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం ఉండాలి. మనందరం కలిసికట్టుగా, చేయిచేయి కలిపి ఏకాభిప్రాయంతో విధానాలు రూపొందించి ప్రజలకు విస్తృతంగా సేవ చేయాలి’ అని అన్నారు. 

లోక్‌సభకు పోటీ చేయాలని కోరిక.. ఒక్క ఛాన్స్‌ అడిగా: కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎలాంటి పదవుల్లో ఉన్నా మనం ఈ దేశానికి సేవకులమని, ఇది మన దేశమని ఉపరాష్ట్రపతి అన్నారు. రాష్ట్రపతి నుంచి ముఖ్యమంత్రి వరకు ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగారనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి రానివ్వకూడదన్నారు. అది సరికాదని, కాస్త సున్నితత్వం ప్రదర్శించాలని సూచించారు. 

ఇటీవల జైపుర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం గహ్లోత్‌ మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి దిల్లీకి, రాజస్థాన్‌కు అప్‌ అండ్‌ డౌన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్‌ అయినా, రాష్ట్రపతి అయినా తాము గౌరవిస్తామని... ఎన్నికల సమయంలో ఇలా వరుస పర్యటనలు చేయడం సరికాదని అన్నారు. ‘రాజకీయ నాయకులు రండి.. కానీ, ఉప రాష్ట్రపతిని పంపించొద్దు. అది రాజ్యాంగ పదవి. మాకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిపై గౌరవం ఉంది. నిన్న ఉప రాష్ట్రపతి వచ్చి ఐదు జిల్లాల్లో పర్యటించారు. అందులో ఏమైనా లాజిక్‌ ఉందా? ఇది ఎన్నికల సమయం. ఈ సమయంలో మీరు వస్తే అది రకరకాల సందేశాలను పంపిస్తుంది. ప్రజాస్వామ్యానికి అది మంచిది కాదు’ అని గహ్లోత్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని