Amit Shah: ఏపీలో వచ్చేది ఎన్డీయే సర్కారే

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది ఎన్డీయే సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామనీ విశ్వాసం వెలిబుచ్చారు.

Updated : 27 May 2024 06:57 IST

ఒడిశా, అరుణాచల్‌లలోనూ ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తాం
ఏపీలో 17 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంటాం
సార్వత్రిక సమరంలో కచ్చితంగా 400కుపైగా సీట్లు గెలుస్తాం
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా
వచ్చే అయిదేళ్లలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకొస్తామని వెల్లడి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చేది ఎన్డీయే సర్కారేనని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సంపూర్ణ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో తాము దాదాపు 17 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటామనీ విశ్వాసం వెలిబుచ్చారు. సార్వత్రిక సమరంలో దేశవ్యాప్తంగా 400కుపైగా సీట్లు సాధిస్తామన్నారు. ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌లలోనూ ఈ దఫా కమలదళం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తుందని జోస్యం చెప్పారు. ‘పీటీఐ’ వార్తాసంస్థతో ముఖాముఖిలో తాజాగా ఆయన పలు అంశాలపై  మాట్లాడారు. ఈసారి అధికారంలోకి వచ్చాక.. ఐదేళ్ల కాలంలో విస్తృత సంప్రదింపుల అనంతరం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తాము అమలు చేయనున్నట్లు షా చెప్పారు. 

విపక్ష పాలిత రాష్ట్రాల్లోనూ సత్తాచాటుతాం 

భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాకుండా, విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ ఈ దఫా తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని షా ధీమాగా పేర్కొన్నారు. 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో కమలదళం 75 స్థానాలు గెల్చుకుంటుందని అంచనా వేశారు. ఆ రాష్ట్రంలో 16-17 ఎంపీ సీట్లను తమ ఖాతాలో వేసుకుంటామని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 17, పశ్చిమ బెంగాల్‌లో 24-32 లోక్‌సభ స్థానాలు ఎన్డీయేకు దక్కుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. 

యూసీసీ మన బాధ్యత 

యూసీసీని అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యతను రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల భుజస్కంధాలపై ఉంచారని షా పేర్కొన్నారు. రాజ్యాంగ పరిషత్‌ నిర్దేశించిన మూలసూత్రాల్లో యూసీసీ కూడా ఉందని చెప్పారు. తమ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చాక.. అన్ని వర్గాలతో  సంప్రదింపులు జరిపి వచ్చే ఐదేళ్లలో దాన్ని అమల్లోకి తీసుకొస్తుందని స్పష్టం చేశారు.  

అగ్నిపథ్‌ కంటే ఆకర్షణీయ పథకం లేదు 

సాయుధ బలగాల్లో నియామకం కోసం మోదీ సర్కారు తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు. అగ్నిపథ్‌ కంటే ఆకర్షణీయ పథకం యువతకు ఇంకొకటి ఉండదన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పదవీవిరమణ పొందే అగ్నివీర్‌లకు రిజర్వేషన్‌ కారణంగా కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో   ఉద్యోగావకాశాలు 7.5 రెట్లు అధికంగా ఉంటాయని తెలిపారు. అగ్నిపథ్‌ను సరిగా అర్థం చేసుకోకుండా.. దాన్ని రద్దు చేస్తామని హామీ ఇస్తున్న  రాహుల్‌గాంధీని చూస్తుంటే జాలేస్తోందన్నారు. 

సైకిల్‌పై, మెర్సిడెస్‌ కారుపై ఒకటే పన్ను ఉండాలా? 

ఏకీకృత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని తీసుకొస్తామంటూ కాంగ్రెస్‌ హామీ ఇస్తోందని షా తెలిపారు. ధనవంతులు ఉపయోగించే విలాస వస్తువులపై, పేదలు వాడే సరకులపై ఒకే పన్ను రేటును అమల్లోకి తీసుకురావడం ఎలా సముచితమని ప్రశ్నించారు. ‘‘ప్రస్తుతం సైకిళ్లపై 5% పన్ను ఉంది. మెర్సిడెస్‌ కారుపై 28% పన్ను వసూలు చేస్తున్నాం. ఆ రెండింటిపై ఒకటే పన్ను ఉండాలా? ఈ ప్రశ్నకు రాహుల్‌ సమాధానం చెప్పాలి’’ అని పేర్కొన్నారు. 

మతం ఆధారిత ప్రచారం చేయట్లేదు 

సార్వత్రిక ఎన్నికల్లో తామేమీ మతం ఆధారిత ప్రచారం చేయడం లేదని షా స్పష్టం చేశారు. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం, ఆర్టికల్‌-370 రద్దును చూపుతూ ఓట్లు అడగడం, యూసీసీని అమలు చేస్తామని చెప్పడం మతం ఆధారిత ప్రచార కార్యకలాపాలే అయితే.. భాజపా అలాంటి ప్రచారం చేసిందని, ఇకముందూ కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. 

రాహుల్‌గాంధీ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే ఈసీపై ఆరోపణలు 

ఈవీఎంలు, పోల్‌ డేటాకు సంబంధించి  ఈసీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండటాన్ని షా తప్పుబట్టారు. భాజపా ఓడిపోయిన తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఇప్పుడు అనుసరించిన విధానాలనే ఈసీ అనుసరించిన సంగతిని గుర్తుచేశారు. ఓటమిని ముందుగానే గ్రహించి.. రాహుల్‌ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే పోలింగ్‌ విధానంపై కాంగ్రెస్‌ ప్రశ్నలు లేవనెత్తుతోందంటూ ఎద్దేవా చేశారు. 

ఛత్తీస్‌గఢ్‌లో తప్ప మరెక్కడా మావోయిస్టులు లేరు 

వచ్చే 2-3 ఏళ్లలో దేశంలో నక్సలిజం సమస్య అంతమవుతుందని షా ఉద్ఘాటించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మరెక్కడా మావోయిస్టులు లేరని పేర్కొన్నారు. ‘‘గతంలో పశుపతినాథ్‌ నుంచి తిరుపతి వరకు ఉన్న ప్రాంతాన్ని నక్సల్‌ నడవాగా కొందరు పేర్కొనేవారు. ఇప్పుడు ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో నక్సలిజం అంతమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ గత అయిదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటంతో నక్సలిజం నిర్మూలన సాధ్యం కాలేదు. ఇప్పుడు మేం అధికారంలోకి వచ్చాం. 2-3 ఏళ్లలో అక్కడ కూడా సమస్య పూర్తిగా తొలగిపోతుంది’’ అని పేర్కొన్నారు. 


మోదీ సర్కారు విజయమది

జమ్మూకశ్మీర్‌లో ఈసారి వేర్పాటువాదులు కూడా అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని షా అన్నారు. అక్కడ పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడం మోదీ ప్రభుత్వం సాధించిన విధానపరమైన విజయమని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులోగా జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత దానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. 


జమిలికి టైమొచ్చింది

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సమయం వచ్చేసిందని షా అన్నారు. వాటితో ఎన్నికల వ్యయం దిగివస్తుందని పేర్కొన్నారు. మండే ఎండల్లో కాకుండా, మరేదైనా సమయంలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడంపై కూడా దృష్టిపెట్టనున్నట్లు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని