PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు.

Updated : 17 May 2024 13:18 IST

దిల్లీ: దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) గట్టిగా బదులిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు. ఈ సందర్భంగా అవినీతి కేసుల్లో ఈడీ (ED Raids) స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

‘‘గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారు. ఆ డబ్బంతా తిరిగి వారికి చెందాలని కోరుకుంటున్నా. ఇందుకోసం న్యాయబృందం సలహా కోరుతాం. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోం. దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకున్న సొత్తు (Money Seized by ED)ను ఏం చేయాలో సలహా ఇవ్వాలని ఇప్పటికే న్యాయవ్యవస్థను కోరా’’ అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడించారు.

అటల్‌ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ

400 మార్క్‌.. అక్కడి నుంచే

ఈ ఇంటర్వ్యూలో ప్రధాని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. ‘‘దీని గురించి నేను ముందెన్నడూ చెప్పలేదు. గెలుస్తామా ఓడుతామా? అన్నది కూడా మాట్లాడలేదు. 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారు. వాళ్ల దృక్పథం నాకు తెలుసు. 2019 ఎన్నికల నుంచే మా కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉంది. ఈసారి 400 మార్క్‌ దాటాలని మా నేతలకు చెప్పాం’’ అని మోదీ తెలిపారు.

ఇక, హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని