Bellwether Seats: ఇక్కడ విజయం సాధిస్తే.. గెలుపు సునామీనే: ఏంటా ‘బెల్‌వెదర్ సీట్స్’..?

దేశవ్యాప్తంగా కొన్ని నియోజవర్గాలపై అందరి దృష్టి ఉంటుంది. వాటిలో ఎన్నికల మూడ్‌ను ముందస్తుగానే సూచించే బెల్‌వెదర్ సీట్లు (Bellwether Seats) కూడా ఉంటాయి. 

Updated : 03 Jun 2024 16:52 IST

దిల్లీ: భారత ప్రజాస్వామ్య పండగలో తుది అంకానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలను ప్రకటించి ఒక ఊపు తీసుకువచ్చాయి. మంగళవారం కౌంటింగ్‌తో ఏ పార్టీ జయకేతనం ఎగరవేయనుందో పూర్తి స్పష్టత వస్తుంది. తమ నియోజకవర్గంలో ఫలితం కోసం అభ్యర్థులు ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో బెల్‌వెదర్ సీట్ల (Bellwether Seats)పైనే అందరి దృష్టి ఉంది.

బెల్‌వెదర్ అనేది ఒక ట్రెండ్‌.. అది ఒక రాష్ట్రంలో లేక దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉండనుందనే దానికి సూచికగా ఉంటుంది. రాజకీయ పరిభాషలో బెల్‌వెదర్ సీట్స్‌ అనే పదం వినిపిస్తుంది. ఆ సీట్లు ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఎన్నికల సూచీగా పని చేస్తుంటాయి. రాష్ట్రం/ దేశంలో ఎన్నికల ధోరణి/పరిస్థితిని ఈ నియోజకవర్గాలు ముందస్తుగానే సూచిస్తాయి. అంతేకాక ఏ పార్టీ/కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంటాయి. అలా జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందుకే ఆ నిర్దిష్ట స్థానాల్లో గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది.

9 ఓట్ల తేడాతో వీళ్లు.. 98శాతం ఓట్లతో వాళ్లు: లోక్‌సభ ఎన్నికల్లో ఈ రికార్డులు తెలుసా?

అలాంటి సీట్లలో కొన్ని.. జార్ఖండ్‌లోని రాంచీ, హరియాణాలోని కర్నాల్‌, ఫరీదాబాద్‌, జమ్మూకశ్మీర్‌లోని జమ్ము, ఉదంపుర్‌, తెలంగాణలోని సికింద్రాబాద్‌, గుజరాత్‌లోని వల్సాద్‌, జామ్‌నగర్‌, ఆనంద్, బనాస్కాంఠాలో వచ్చిన ఫలితాలే దేశవ్యాప్తంగా ప్రతిబింబించాయి. అక్కడ విజయం సాధించిన పార్టీనే కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చింది. కర్నాల్‌లో 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా ఆ సమయంలో దేశంలోనూ హస్తం నేతృత్వంలోని యూపీఏనే అధికారాన్ని చేజిక్కించుకుంది. 1999, 2014, 2019లో భాజపా విజయం సాధించగా.. అప్పుడు అదే పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. జమ్ములో 1998, 1999, 2014, 2019లో భాజపా అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. సికింద్రాబాద్‌లో 2004, 2009 హస్తం పార్టీ గెలవగా.. 2014, 2019 కమలం పార్టీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. ఈ స్థానాల్లో ఇప్పుడు అదే ట్రెండ్‌ రిపీట్‌ అవుతుందో, లేదో చూడాలి. ఇదిలాఉంటే.. కేంద్రంలో మూడోసారి అధికారం భాజపాదేనంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి కాషాయ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని