Lok Sabha Elections: ‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 18 May 2024 22:14 IST

దిల్లీ: తాను 50-60 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఈ దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు తన కుటుంబసభ్యులు అవుతారని, ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తానని అనుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పం కోసం రేయింబవళ్లు పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం కోసమే జీవిస్తున్నానన్న ఆయన.. డెమోక్రసీ తన నరనరాన ప్రవహిస్తోందని చెప్పారు. శనివారం ఈశాన్య దిల్లీలో భాజపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ప్రతిపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పేదలు, మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని లాక్కొనేందుకు కుట్రలు చేస్తోన్న శక్తుల నుంచి కాపాడేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రధాని అన్నారు. దేశానికి బలమైన ప్రభుత్వం అవసరమని, ఈ దేశానికి సేవ చేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ‘ఇండియా’ కూటమికి ఒక్క ఓటు కూడా పోవద్దన్న ప్రధాని.. వారి మేనిఫెస్టో ముస్లింలీగ్‌ స్ఫూర్తితో కనబడుతోందని విమర్శించారు. తమ ఓటు బ్యాంకును కాపాడుకొనేందుకు వారు ప్రమాదకరమైన గేమ్‌ ఆడుతున్నారంటూ దుయ్యబట్టారు.

దిల్లీ ప్రజల సౌకర్యార్థం పర్యావరణాన్ని పరిక్షించేలా వందలాది ఎలక్ట్రిక్‌ బస్సుల్ని కేంద్రం అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఎలక్ట్రిక్‌ వాహనాల సమయం. పెట్రోల్, డీజిల్‌ వాహనాల శకం ముగిసిపోతోందన్నారు.  దిల్లీలో నాలుగు తరాలు పాలించిన కాంగ్రెస్‌ ఇప్పుడు నాలుగు సీట్లలో కూడా పోటీ చేయలేని స్థితిలో ఉందని.. చివరికి 10 జనపథ్‌ దర్భార్‌ ఉన్న లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి లేదంటూ ఎద్దేవా చేశారు.  పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సులభతరం చేసి, వారి జీవితాల్లో ఆనందం తీసుకొచ్చేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. యువతకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు, బంధుప్రీతి, కుటుంబ రాజకీయాల కారణంగా ఏళ్లతరబడి దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన ఆ సంప్రదాయాన్ని, ఆలోచనను ఓడించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈశాన్య దిల్లీలో భాజపా తరఫున మనోజ్‌ తివారీ, ‘ఇండియా’ కూటమి నుంచి కాంగ్రెస్‌ నేత కన్హయ్య కుమార్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని