Arvind Kejriwal: వాట్‌నెక్స్ట్‌.. ఎన్నికల్లో ఆప్‌ను నడిపేదెవరు..?

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు సంచలనం సృష్టించింది. ఆయన జైలు గోడల మధ్య నుంచే పాలన కొనసాగిస్తారని పార్టీ చెబుతోంది. కానీ, ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌తో సరితూగే నేత ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది.

Updated : 22 Mar 2024 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడిన వేళ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఓ పక్క రాజకీయ పార్టీలు మొత్తం 2024 ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఖరారులో తలమునకలైన సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రభావం చూపించే పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీ ప్రచారం వరకూ పలు సవాళ్లు ఎదురుకానున్నాయి.

డిసెంబర్‌లోనే ప్రజాభిప్రాయ సేకరణ..

ప్రస్తుతం జైల్లో ఉన్నా కేజ్రీవాలే ముఖ్యమంత్రి బాధ్యతలను కొనసాగిస్తారని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. ఆ పార్టీ నేత, మంత్రి ఆతిశీ మార్లీనా సీఎం నివాసం వద్ద ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వ్యూహానికి ఆప్‌ ఎప్పుడో పదునుపెట్టింది. గతేడాది డిసెంబర్‌లోనే కేజ్రీవాల్‌ అరెస్టుపై ప్రచారం జరగ్గా.. ఆయన రాజీనామా చేయాలా..? లేదా జైలు నుంచే పాలన కొనసాగించాలా..? అనే అంశంపై ‘మై బీ కేజ్రీవాల్‌’ పేరిట ఆప్‌ పలు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దీనిలో సీఎం పదవి నుంచి ఆయన దిగాల్సిన అవసరం లేదని అత్యధిక మంది కోరుకున్నట్లు నాడు పార్టీ వెల్లడించింది.

న్యాయ నిపుణులు ఏమంటున్నారు..?

కేజ్రీవాల్‌ వద్ద ప్రస్తుతానికి ఎలాంటి కీలక శాఖలు లేకపోవడంతో పాలనకు ఇబ్బంది లేకపోయినా.. సీనియర్ మంత్రులు, అధికారులతో రోజువారీ సమావేశాలు, సమీక్షలు చేయడంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. సీఎం అరెస్టైతే రాజీనామా చేయాలని, పాలన పగ్గాలను వేరేవారికి ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదని న్యాయ నిపుణుడు ఎస్‌కే శర్మ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తి దోషిగా తేలే వరకూ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, జైలు గది నుంచి సమీక్షలు, మంత్రి వర్గ సమావేశాల నిర్వహణ వాస్తవిక పరిస్థితుల్లో సాధ్యం కాదని.. సంక్షోభ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కూడా ఉందన్నారు. దీంతో దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాత్ర చాలా కీలకం కానుంది. గతంలో బిహార్‌ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలుకు వెళ్లగా.. పగ్గాలను తన భార్య రబ్రీదేవికి ఇచ్చారు. ఇటీవల ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరెన్‌ బాధ్యతల నుంచి వైదొలగారు. కేజ్రీవాల్‌ పదవిలో కొనసాగితే.. జైలు నుంచి పాలన సాగించిన తొలి సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. 

సీఎం రేసులో ఎవరు..?

ఇక సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయాల్సి వస్తే.. ఆ స్థానం భర్తీ చేసేందుకు పార్టీ నుంచి విద్యా శాఖ మంత్రి ఆతిశీ, వైద్య శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్లు తెరపైకి రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఆతిశీ ఇప్పటికే అత్యధిక శాఖలను నిర్వహిస్తున్నారు. ఆమె కేజ్రీవాల్‌కు అత్యంత విశ్వాసపాత్రురాలు. పైగా పార్టీ ప్రతినిధిగా ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇక భరద్వాజ్‌ కూడా పలు శాఖలను నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని, పార్టీని ముందుకు తీసుకెళుతున్నారన్న పేరుంది.

కేజ్రీవాల్‌ సతీమణి సునీత పేరు కూడా రేసులో నిలిచే అవకాశం ఉంది. ఆమె రెవెన్యూ సర్వీస్‌ మాజీ అధికారిణి. తరచూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటూ పరిస్థితులను తెలుసుకుంటున్నారు.

ఎన్నికల ప్రచారంపై ప్రభావం..

అన్నింటికి మించి ఆప్‌ రాజకీయ బాధ్యతలే ఇప్పుడు కత్తిమీద సాముగా మారనున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే క్రమంలో ప్రజాకర్షక నేతగా కేజ్రీవాల్‌ వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు మనీష్‌ సిసోదియా, సత్యేందర్‌ జైన్‌, ఎంపీ సంజయ్‌ సింగ్‌ కూడా జైళ్లలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ అరెస్టుతో ఆప్‌ రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో కొన్ని సమస్యలు రావచ్చు. దిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, హరియాణాలు పార్టీకి చాలా కీలకం. ఇక్కడ ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహిస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ దేశవ్యాప్త ప్రచార బాధ్యతలను భుజాన వేసుకోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని