Arvind Kejriwal: కేజ్రీవాల్‌ సర్‌.. మీ మఫ్లర్‌ ఏదీ.? ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న!

మఫ్లర్‌ మ్యాన్‌గా పాపులర్‌ అయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. దీనికి సంబంధించిన ఆసక్తికర సంభాషణను ఆప్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Published : 30 Nov 2022 15:59 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నెలకొల్పిన తొలినాళ్లతో తలపై టోపీ, మెడలో మఫ్లర్‌తో అరవింద్‌ కేజ్రీవాల్ ఎంతో పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం దిల్లీ సీఎంగా ఉన్న ఆయనకు ఎన్నికల ప్రచారంలో వింత ప్రశ్న ఎదురైంది. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ ఇంటింటికి తిరుగుతూ ఆప్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో చిరాగ్‌ దిల్లీ ప్రాంతంలో ఓ ఇంటి వద్ద మహిళ ‘‘కేజ్రీవాల్ సర్‌ మీరు మఫ్లర్‌ ఎందుకు ధరించలేదు’’ అని ప్రశ్నించగా,  ‘‘ప్రస్తుతం చలిగా లేదు కదా’’ అని కేజ్రీవాల్ బదులిచ్చారు. ఈ ఆసక్తికర సంభాషణకు సంబంధించిన వీడియోను ఆప్‌ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. 

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్‌ ప్రచారం కొనసాగిస్తోంది. కేజ్రీవాల్ ఇంటింటి ప్రచారంతోపాటు, టీ దుకాణాల వద్ద ప్రజలతో మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి హామీలిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే 10 హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ఆప్‌ ప్రకటించింది. వీటిలో రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్ల కు మినీ కౌన్సిలర్స్‌ హోదా, బిల్డింగ్ అనుమతులకు ఆన్‌లైన్‌లో అనుమతి, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం, పార్క్‌ల సుందరీకరణ, కార్పొరేషన్‌ ఉద్యోగులకు సమయానికి జీతాల చెల్లింపు, కార్పొరేషన్‌ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగపరచడం వంటివి ఉన్నాయి. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు డిసెంబరు 4న ఎన్నికలు నిర్వహించి, డిసెంబరు 7న ఫలితాలు వెల్లడించనున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని