Hema Malini: మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని

మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated : 27 Mar 2024 20:41 IST

బృందావన్: మథురలో ప్రజలు నరేంద్రమోదీ ప్రభుత్వానికే పట్టం కడతారని నటి, భాజపా ఎంపీ అభ్యర్థి హేమమాలిని(Hema Malini) ఆశాభావం వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి భాజపా తరపున మథురలో పోటీ చేస్తున్న ఆమె తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.

అసంపూర్తిగా ఉన్న బృందావన మందిరాన్ని పూర్తి చేయడమే తన ధ్యేయమన్నారు. వందల ఏళ్లుగా దేశ ప్రజలు అయోధ్యలో రామమందిరం కోసం కన్న కలలను ప్రధాని మోదీ నిజం చేశారని ఆనందం వ్యక్తంచేశారు. కృష్ణ జన్మభూమి వివాదం కోర్టులో ఉంది కాబట్టి నేను దానిపై వ్యాఖ్యానించలేను. కానీ శ్రీకృష్ణుడు కోరుకుంటే కచ్చితంగా అది జరుగుతుంది అని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న బృందావనాన్ని పూర్తి చేయడానికే భాజపాను ఈ నియోజకవర్గంలో టికెట్ అడిగానని అన్నారు.

‘‘నేను అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలిని కాదు. కానీ, ఈ పదవిలో ఉన్నందున నేను కోరుకున్న పనులు చేయగలను. నేను శ్రీకృష్ణుడి భక్తురాలిని. మథుర కాకుండా మరే స్థానం ఇచ్చినా నేను పోటీ చేసేదాన్ని కాదు. రాజకీయాల్లోకి రావాలనీ అనుకోలేదు. అది దైవ నిర్ణయంగా జరిగిపోయింది.’’ అని అన్నారు. ఎంపీగా ఎన్నికైన మొదట్లో ఈ ప్రాంత పరిస్థితులను చూసి తాను ఎంతగానో ఆందోళన చెందానని గుర్తుచేసుకున్న    హేమమాలిని తనకు మూడోసారి టికెట్ ఇచ్చినందుకు భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘మోదీ దేశానికి చాలా చేశారు కాబట్టి ప్రజలు భాజపాను గెలిపించాలనుకుంటారు. నేను కూడా నా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డాను. రైతులకు ఏ సమస్య వచ్చినా దానిని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాను. కరెంటు, తాగు, సాగునీరు, రోడ్లను బాగు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాను. ఇక్కడికి అతిపెద్ద ప్రపంచస్థాయి థియేటర్‌ను తీసుకొచ్చాను. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ కళాకారులు ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వవచ్చు. రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించాను, ఫ్లైఓవర్లు, రైల్వే కనక్టివిటీ మొదలైన ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. మథురకు విమానాశ్రయం తేవాలనేది నా కల.’’ అని తెలిపారు. 

యమునా జలాల కాలుష్యానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు. యమునా నదిని శుభ్రం చేయడం  చాలా కష్టమైనప్పటికీ ఈసారి పూర్తి చేస్తానని, మొదటినుంచి దానికోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని