Yogi Adityanath: రాహుల్‌లాంటి వారు ఉంటే మా పని ఈజీ: యోగి ఆదిత్యనాథ్‌

రాహుల్‌ గాంధీ లాంటి వారు ప్రతిపక్షంలో ఉంటే భాజపా పని సులువు అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. విద్వేష రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు.

Published : 08 Feb 2023 01:31 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi) ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ లాంటి వారు ప్రతిపక్షంలో ఉంటే భారతీయ జనతా పార్టీ (BJP) పని మరింత సులువు అవుతుందంటూ ఎద్దేవాచేశారు. దేశంలో భాజపాకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

రాహుల్‌గాంధీ చేసిన భారత్‌ జోడో యాత్రను సైతం యోగి ఆదిత్యనాథ్‌ తప్పుబట్టారు. భాజపా ఏం చేసినా దేశం కోసం చేస్తుందన్నారు. రాహుల్‌ యాత్రలో పార్టీ ఎజెండా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. విద్వేష రాజకీయాలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. లేదంటే ఆ పార్టీ ప్రతిష్టే మసకబారుతుందన్నారు.

ఇటీవల నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  ఇటీవల రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ‘ఇది అమృత్‌కాల్‌ బడ్జెట్‌ కాదు.. మిత్ర్‌ కాల్‌ బడ్జెట్‌’ అంటూ విమర్శలు గుప్పించారు. సంపన్నులకు ప్రయోజనం చేకూర్చడం మినహా సామాన్యులకు, నిరుద్యోగులకు ఎలాంటి ప్రయోజనం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలనూ తప్పుబట్టారు. కాంగ్రెస్‌, ఇతర విపక్షాలకు దేశం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా అమృత్‌ కాలాన్ని అవహేళన చేయరని యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భాజపా విజయపథంలో దూసుకెళ్తోందని, ఫలితాలే అందుకు నిదర్శనమని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని