Gorakhpur: గోరఖ్‌పుర్‌లో భోజ్‌పురి యాక్షన్‌ చిత్రం.. యోగి అడ్డాలో హోరాహోరీ..!

యూపీలో ఆరోవిడత ఎన్నికల్లో హాట్‌ సీట్‌గా మారిన స్థానాల్లో యోగి ఆదిత్యనాథ్‌ సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పుర్‌ ఒకటి. ఇక్కడి ఎన్‌డీఏ-ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. 

Published : 28 May 2024 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపాలో మోదీ తర్వాత అత్యంత పాపులర్‌ లీడర్‌ యోగి. ఇప్పుడాయన సొంత నియోజకవర్గమైన గోరఖ్‌పుర్‌ (Gorakhpur)లో పోరు యూపీలో హీటు పుట్టిస్తోంది. ఇక్కడ ఎన్నికలు చివరిదశలో ఉండడంతో పార్టీలన్నీ తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అభ్యర్థులు ఇద్దరూ ప్రజాదరణలో ఏమాత్రం తీసిపోని భోజ్‌పురి నటులే. దీంతో హోరాహోరీ పోరు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ భాజపా తరఫున నటుడు రవికిషన్‌ శుక్లా, ఇండియా కూటమి తరఫున సమాజ్‌వాదీ పార్టీ పక్షాన నటి కాజల్‌ నిషాద్‌ బరిలో ఉన్నారు. పేరుకే ఇక్కడ రవి కిషన్‌ నిలిచినా.. యూపీ సీఎం అన్నీ తానై కమలదళాన్ని నడిపిస్తున్నారు. ఫలితంగా ఈ ఎన్నిక యోగి వర్సెస్‌ ఇండియా కూటమిగా మారిపోయింది. 

ఇండియా కూటమి నుంచి బలమైన అభ్యర్థి..

గోరఖ్‌పుర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో యోగికి అన్ని వర్గాల్లో విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. అదే భాజపాకు బలంగా మారింది. ఇక ఎస్పీ అభ్యర్థి కాజల్‌ కూడా తక్కువ ఏమీ కాదు. నటిగా ఆమెకు ఉన్న ఇమేజీకి తోడు కులసమీకరణ అదనపు బలంగా నిలిచింది. ఆమెది నిషాద్‌ సామాజిక వర్గం. ఓబీసీ కిందకు వచ్చే ఈ జాతి ఓటర్లు అక్కడ నాలుగోవంతు ఉంటారు. అభ్యర్థుల జయాపజయాలను వారు శాసిస్తారు. 

 2018లో భాజపాకు ఇక్కడ చుక్కెదురైంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. నాడు ఎంపీ పదవికి యోగి రాజీనామా చేసి.. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో 2018లో జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్‌ నిషాద్‌, భాజపా అభ్యర్థి ఉపేంద్ర శుక్లాపై 21,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇప్పుడు ఈ అంశమే కమలనాథుల కలవరానికి కారణమైంది. తన సామాజిక వర్గం నుంచి ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది. ఇక నియోజకవర్గంలోని యాదవుల మద్దతు కూడా ఆమెకే ఉంటోంది. కాకపోతే.. గతంలో ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు, మేయర్‌ ఎన్నికలో ఒకసారి ఓటమి పాలయ్యారు. 

ఈ నియోజకవర్గంలో మొత్తం 21 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 5.50 లక్షల ఓటర్లు నిషాద్‌లే. యాదవ ఓట్లు 2.25 లక్షలు ఉంటాయి. రెండు లక్షల ముస్లిం, 2 లక్షల దళిత, 3 లక్షల బ్రాహ్మణ-ఠాకూర్‌ ఓట్లు, లక్ష భూమిహార్‌-బనియా ఓట్లు ఇక్కడున్నాయి.

యోగికి పెట్టని కోట..

యోగి ఎంపీగా ఇక్కడినుంచి ఐదుసార్లు విజయం సాధించారు. తొలుత ఈ నియోజకవర్గంలో ఆయన ఆధ్యాత్మిక గురువు మహంత్‌ అవైద్యనాథ్‌ రెండుసార్లు గెలిచారు. ఆయన తర్వాత 1998 నుంచి యోగి వరుసగా పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. 2018లో భాజపా ఓడినా.. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి వేగంగా మారిపోయింది. కమలనాథులు తిరిగి పట్టు బిగించి 2019లో ఈ స్థానాన్ని పార్టీ ఖాతాలో వేశారు. ఫలితంగా రవి కిషన్‌ ఎంపీగా పార్లమెంట్‌ మెట్లు ఎక్కారు.

రవి కిషన్‌పై అసంతృప్తి..

ప్రస్తుతం నియోజకవర్గ ప్రజల్లో రవికిషన్‌పై మాత్రం అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అతడు గెలిచిన తర్వాత నియోజకవర్గం ముఖం చూడలేదని ఓటర్లు గుర్రుగా ఉన్నారు. కేవలం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పుర్‌లో పాల్గొన్న కొన్ని కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యాడని అంటారు. ఈ విషయం రవికి కూడా బాగా తెలుసు. అందుకే ప్రచారంలో కూడా తాను యోగి అనుచరుడిని మాత్రమే అని చెబుతున్నాడు. బరిలో నిలిచింది.. తాను కాదని.. యోగి ఆదిత్యనాథ్‌ అనుకోవాలని ఓటర్లను కోరుతున్నాడు.

గోరఖ్‌నాథ్‌ మఠం కీలక పాత్ర

ఈ నియోజకవర్గంలో గోరఖ్‌నాథ్‌ మఠం దాదాపు 45 విద్యాసంస్థలను, పెద్ద ఆస్పత్రిని నిర్వహిస్తోంది. సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ఈ మఠానికి అధిపతి. ఫలితంగా అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, ఠాకూర్లు, భూమిహార్స్‌, బనియాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వెనకబడిన వర్గాల్లోని ఓట్లను కూడా తీసుకొస్తున్నాయి. భాజపాలో యోగి పట్టు పెరగటానికి ఇది పరోక్షంగా కారణమైంది. సంజయ్‌ నిషాద్‌ ఆధ్వర్యంలోని నిషాద్‌ పార్టీ భాజపా మిత్ర పక్షం కావడం కమలనాథులకు కలిసొచ్చే అంశం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని