Shashi Tharoor: ఇకపై మోదీ తనకు నచ్చినట్లు చేస్తానంటే కుదరదు: శశి థరూర్‌

Shashi Tharoor: భాజపాకు పూర్తి మెజార్టీ లభించని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మోదీ ఇకపై భాగస్వామ్య పక్షాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని శశి థరూర్ తెలిపారు.

Updated : 07 Jun 2024 08:36 IST

Shashi Tharoor | దిల్లీ: ఇండియా కూటమి బలమైన, సమర్థమైన ప్రతిపక్షంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్ నేత శశి థరూర్‌ (Shashi Tharoor) అన్నారు. ఎన్డీయే కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లభించిందని గుర్తుచేశారు. వారి హక్కును కాలరాసేందుకు తాము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు.

‘‘ఎన్నికలకు ముందే ఏర్పడిన ఎన్డీయే (NDA) కూటమికి ఎన్నికల్లో కావాల్సిన సంఖ్యాబలం లభించింది. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వారి హక్కును కాదనే ప్రశ్నే లేదు. తాజా పరిస్థితుల నుంచి నాటకీయ పరిణామాలను సృష్టించడంలో అర్థం లేదని ఇండియా కూటమి చాలా స్పష్టంగా నిర్ణయించింది. వారిని (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి. మేం (ఇండియా కూటమి) బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఉంటాం’’ అని థరూర్‌ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో భాజపా (BJP) 240 సీట్లు సాధించగా.. 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయేకి 293 సీట్లతో మెజార్టీ ఉండగా, విపక్ష కూటమి 234 వద్ద ఆగిపోయింది. దీంతో సంఖ్యాబలాన్ని పెంచుకునే అవకాశాలపై ఇండియా కూటమి దృష్టిసారించిందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలో థరూర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని స్పష్టమైన సంకేతాలిచ్చారు. సరైన సమయంలో తగిన అడుగులు వేయాలని నిర్ణయించామని తెలిపారు. మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ ధీమా ఇవ్వటంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఎన్డీయే కూటమి సన్నాహాలు చేస్తోంది. 

క్యాబినెట్‌ కూర్పుపై ఉత్కంఠ

సంకీర్ణ ప్రభుత్వాల వల్ల నష్టమేమీ ఉండదని థరూర్‌ (Shashi Tharoor) వ్యాఖ్యానించారు. పైగా ప్రధానమంత్రితో పాటు భాజపా మరింత జవాబుదారీతనం, బాధ్యతతో వ్యవహరించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘‘గత పదేళ్లలో వారి పాలనా విధానాన్ని చూశాం. వారి దారిలో నడవడమా లేక రోడ్డున పడడమా అనే విధంగా సాగింది. నోట్ల రద్దు సమయంలో ఆర్థిక మంత్రి సహా క్యాబినెట్‌ను కూడా సంప్రదించలేదు. ముఖ్యమంత్రులకు సమాచారం లేకుండా స్వల్ప వ్యవధిలోనే లాక్‌డౌన్‌లు ప్రకటించారు. ఇలాంటి వైఖరికి ఇక ముగింపు పడింది. మోదీ తనకు నచ్చినట్లు చేసే విధానం ఇకపై ఉండదు. సొంతంగా మెజార్టీ లేని నేపథ్యంలో సంకీర్ణ పక్షాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని థరూర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు