YS Sharmila: కాంగ్రెస్‌ ‘చలో సెక్రటేరియట్‌’లో ఉద్రిక్తత.. వైఎస్‌ షర్మిల అరెస్టు

మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

Updated : 22 Feb 2024 16:31 IST

తాడేపల్లి: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు.

అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు.. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు.  ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. షర్మిలతో పాటు కార్యకర్తలు, నాయకులను దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

జగన్‌.. వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారు?

తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సీఎం జగన్‌ మడత పెట్టేశారని షర్మిల ఆరోపించారు. 151 సెక్షన్‌ కింద సంతకాలు తీసుకొని మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఆమెను పంపించేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  ఐదేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన జగన్‌.. వైఎస్‌ఆర్‌ వారసుడినని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే తిరిగి  సొంతగూటికి చేరుకోవడంపై శుక్రవారం స్పందిస్తానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని