Ys Sharmila: అధికారాన్ని అడ్డేసి మరీ.. హంతకుల్ని కాపాడుతోన్న జగనన్న: షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రసంగించారు.

Updated : 12 Apr 2024 21:13 IST

పులివెందుల: ‘‘ఒక వైపు వైఎస్‌ఆర్‌ బిడ్డ.. మరో వైపు హంతకుడు. మా వైపు న్యాయం, ధర్మం ఉంది. వైఎస్‌ఆర్‌ బిడ్డ కావాలో? వివేకా హత్యకేసు నిందితుడు అవినాష్‌రెడ్డి కావాలో పులివెందుల ప్రజలే తేల్చుకోవాలి.  మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజాలారా.. మాకు న్యాయం చేయండి’’ అంటూ పీసీసీ అధ్యక్షురాలు, కడప లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. అవినాష్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కడప నుంచి అతడిని మార్చాలని వైకాపా చూస్తోందన్నారు. అలా మారిస్తే వివేకాను చంపింది అవినాషే అని జగన్‌ నమ్మినట్టే కదా! అని వ్యాఖ్యానించారు.

అవినాష్‌రెడ్డిని సీబీఐ టచ్‌ చేయలేకపోయింది..

‘‘వివేకాను చంపించింది అవినాష్‌రెడ్డే అని సీబీఐ ఆధారాలతో చెబుతుంటే.. జగన్‌ తన అధికారం అడ్డుపెట్టి హంతకులను కాపాడుతున్నారు. సాక్షాత్తూ వైఎస్‌ తమ్ముడు హత్యకు గురైనా న్యాయం జరగట్లేదు. హత్య చేసిన వాళ్లు, చేయించిన వాళ్లకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ నిర్ధరించింది. గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇన్ని సాక్ష్యాలున్నా సీబీఐ.. అవినాష్‌రెడ్డిని టచ్‌ చేయలేకపోయింది. ప్రజలు జగన్‌కు అధికారం ఇచ్చింది నిందితులను కాపాడేందుకేనా? జగన్‌ సీఎం అయ్యాక అందరికంటే ఎక్కువ నష్టపోయింది సునీతే. పులి వెందుల పులి అన్నారు. ప్రధాని మోదీ ముందు జగన్‌ పిల్లిలా మారారు.  ప్రత్యేక హోదా కోసం ఆనాడు రాజీనామా డ్రామాలు, దీక్షలు చేశారు. సీఎం అయిన తర్వాత భాజపాతో దోస్తీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. జలయజ్ఞం వైఎస్‌ఆర్‌ కల. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తామన్నారు.. చేశారా? పులివెందుల బిడ్డ సీఎంగా ఉండి రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా కట్ట లేదంటే అవమానం కాదా?

జనాలు జగన్‌ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా?

వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలా. సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? జనాలు జగన్‌ను నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా? పులివెందుల పులి కాదు.. పిల్లి. 2.30లక్షల ఉద్యోగాలు ఇస్తామని నాలుగున్నరేళ్లుగా కోటల నిద్రపోయాడు. ఇప్పుడు కుంభకర్ణుడి లెక్క నిద్రలేచి డీఎస్సీ అంటూ హడావుడి చేస్తున్నారు. ఐదేళ్లలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. 5ఏళ్లు హంతకులను కాపాడారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు. నేను వైఎస్‌ఆర్‌ బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. వైఎస్‌ఆర్‌ బిడ్డ ఎవరికీ భయపడదు. హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా..’’ అని వివరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని