Kuppam-Chandrababu: వైకాపా ‘కుప్పం’గంతులకు చెక్‌!

కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామంటూ బీరాలు పోయిన వైకాపా ఈ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం అంతటా చతికిలపడింది.

Updated : 05 Jun 2024 13:06 IST

ఆ పార్టీ కక్ష సాధింపులకు చంద్రబాబు దీటైన వ్యూహం
శ్రేణులను ఏకం చేసేలా పావులు కదిపిన అధినేత
ఎనిమిదోసారీ ఘన విజయం

కుప్పం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటామంటూ బీరాలు పోయిన వైకాపా ఈ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం అంతటా చతికిలపడింది. హనుమంతుడి ముందా కుప్పిగంతులు అన్న చందంగా చంద్రబాబు.. వైకాపా అరాచకాలన్నింటినీ ఎదుర్కొంటూ తనదైన తరహాలో పావులు కదిపి విజయఢంకా మోగించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో కుప్పం.. ఎన్నో కక్షసాధింపు ధోరణులను చూసింది. వైకాపా ఇన్‌ఛార్జిగా భరత్‌ను నియమించి అక్కడ ఆధిపత్యం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు వేసింది. అయినా చివరకు కుప్పం ప్రజలు చంద్రబాబుకే బ్రహ్మరథం పట్టారు.

కేసులకు ఎదురొడ్డి..

గడిచిన అయిదేళ్లలో వైకాపా మూకలు కుప్పంలో చేసిన అరాచకాలు ఇన్నీ, అన్నీ కావు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ భరత్‌లు అక్కడి తెదేపా శ్రేణులను ఎటూ కదలనివ్వలేదు. కుప్పం నియోజకవర్గాన్ని మరో ‘పుంగనూరు’ను చేయాలన్న దురుద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక తెదేపా నాయకులను భయభ్రాంతులకు గురిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను తెదేపా పోటీచేయలేని పరిస్థితికి తీసుకువచ్చారు. చంద్రబాబు అక్కడ సొంతిల్లు నిర్మించుకోకుండా అడ్డుకున్నారు. అధికారం ఉందన్న అండ, ధనబలం, దౌర్జన్యాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన మాదిరిగానే.. సార్వత్రిక సమరంలోనూ ఆధిపత్యం చెలాయించాలన్న కుట్రతో వైకాపా వ్యవహరించింది. అయినా కేసులకు ఎదురొడ్డి నియోజకవర్గంలో తమ పట్టు పెంచేలా చంద్రబాబు దీటైన వ్యూహం రచించి విజయం సాధించారు.

శ్రీకాంత్‌కు బాధ్యతలు

తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి తెదేపా తరపున గెలుపొందిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌కు చంద్రబాబు కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఏడాది కిందట నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనరుగా నియమితులైన శ్రీకాంత్‌.. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. ఎప్పటికప్పుడు అధినేత ఆదేశాలు పాటిస్తూ నియోజకవర్గంలోని ప్రజలకు చేరువయ్యారు.  


అరాచకానికి స్వస్తి...అభివృద్ధికి ఓటు..

వైకాపా అరాచకాలతో విసిగిపోయిన కుప్పం ప్రజలు తగిన సమయం కోసం ఎదురుచూసి వైకాపాకు గుణపాఠం చెప్పారు. చంద్రబాబును 48,006 ఓట్ల ఆధిక్యంతో గెలిపించారు. నాలుగో దఫా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న చంద్రబాబుతోనే కుప్పం మరింత అభివృద్ధి చెందుతుందని, నియోజకవర్గానికి పూర్వవైభవం వస్తుందని భావించిన జనం ఆయనకు పట్టం పట్టారు. 1995-2004, 2014-2019 మధ్యకాలంలో ప్రగతికాంతులతో వెలుగులీనిన కుప్పం నియోజకవర్గం గడిచిన అయిదేళ్లలో వైకాపా కక్షసాధింపుల్లో చిక్కుకుంది. ఇది ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. ఎనిమిదో దఫా కూడా ఆయనకే పగ్గాలు అప్పగించేందుకు కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని