YSRCP: వైకాపాకు ఓటేయకపోతే దాడులే

ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్‌ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం.

Updated : 21 May 2024 06:46 IST

 విశాఖలో అధికార పార్టీ అరాచకం 
ఓటు వేయలేదని మత్స్యకార మహిళా సొసైటీకి వేధింపులు 
బర్మాకాలనీ దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసుల యత్నం
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు 
భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు స్టేషన్‌ బెయిల్‌


వైకాపాకు ఓటు వేయకుండా ఎన్డీయే అభ్యర్థికి వేశామన్న అక్కసుతోనే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు మాపై దాడి చేశారు. తలలు పగిలేలా కొట్టారు. కర్రలు, ఇనుపరాడ్లు, ఇతర మారణాయుధాలతో మమ్మల్ని చంపేందుకు ప్రయత్నించారు. అవి మా కుటుంబ, వ్యక్తిగత తగాదాలని చెబుతూ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 సోమవారం కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో విశాఖ బర్మాకాలనీకి చెందిన బాధితులు సుంకర మణికంఠ, నూకరత్నం, రమ్య, ధనలక్ష్మిల ఆవేదన


ఈనాడు, విశాఖపట్నం - న్యూస్‌టుడే, విశాఖ వన్‌టౌన్, గ్రామీణ భీమిలి: ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్‌ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రలోనూ వైకాపా నాయకుల వల్ల ఫ్యాక్షన్‌ సంస్కృతి పెచ్చరిల్లుతోంది. వైకాపాకు ఓటేయలేదన్న కారణంతో ఆ పార్టీకి చెందిన అరాచక శక్తులు.. విశాఖలోని బర్మాకాలనీలో ఒక కుటుంబంపై పాశవికంగా దాడి చేసి, మహిళలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా కొట్టడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ ఘటన తర్వాత కూడా వైకాపా అరాచకాలు కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనల్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన పోలీసులు.. దాన్నో కుటుంబ తగాదాగా చిత్రీకరించి, కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. బాధితుల ఆవేదనను ప్రసారం చేసిన మీడియా ఛానళ్లపైనా, వారికి అండగా నిలిచిన విశాఖ ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజుపైనా కేసులు పెట్టారు. తలలు పగిలి, దవడలు విరిగిన బాధితులు కళ్లముందే కనిపిస్తుంటే దాన్ని కుటుంబ తగాదాగా తేల్చిపారేశారు. ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్టపడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా... ఈ ఘటనల్ని సిట్‌ దర్యాప్తు పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.


మాట్లాడుతున్న మారుపల్లి పార్వతమ్మ.చిత్రంలో మత్స్యకార సంఘం సభ్యులు

వైకాపాకు ఓటేయలేదని మాపై గ్రావెల్‌ మాఫియా ముద్ర వేసి వాళ్ల సొంత పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. తెదేపాకు ఓటేయడాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు మేం మహిళలమని కూడా చూడకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా గ్రావెల్‌ అమ్ముకుని సంపాదించిన వైకాపా నేతలు... చేపలు అమ్ముకుని బతికే మాపై మాఫియా ముద్ర వేస్తున్నారు.

 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ పరిధిలోని చేపల తిమ్మాపురం గ్రామానికి చెందిన మత్స్యకార మహిళ మారుపల్లి పార్వతమ్మ గోడు


మాకు ప్రాణహాని ఉంది

తమపై దాడికి పాల్పడిన కొందరు వ్యక్తులు బయట స్వేచ్ఛగా తిరుగుతూ, తమను భయపెడుతున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘పోలీసులు మేం చెప్పిన విషయాల్ని వక్రీకరించి, వాస్తవాల్ని మార్చేసి... దాన్ని వ్యక్తిగత, కుటుంబ తగాదాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులూ మాకు అన్యాయం చేశారు’ అని జిల్లా కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో బాధితురాలు సుంకర నూకరత్నం పేర్కొన్నారు. బాధితులు సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ను కలవాలనుకున్నారు. పోలీసులు వారిని వెనక్కు పంపించేసేందుకు ప్రయత్నించారు. జేసీని కలవకుండా వెళ్లేది లేదని బాధితులు స్పష్టం చేయడంతో.. జేసీ వారిని పిలిపించి మాట్లాడారు.  మొదట పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పి వారిని పంపించారు. బాధితులు కలెక్టరేట్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీలకు పంపిస్తున్నట్టు తెలిపారు. ఫిర్యాదులో బాధితురాలు నూకరత్నం పేర్కొన్న అంశాలివీ.

గర్భిణి అని కూడా చూడకుండా కడుపుపై తన్నారు

‘మాకు తెదేపా ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది. ఇంటి ముందు అమర్చిన శిలాఫలకంలో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి సీఎం చంద్రబాబు, అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు చిత్రాలున్నాయి. మా ఇంటి ముందు కిళ్లీ కొట్టు పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. వైకాపా మద్దతుదారులైన లోకేశ్, భూలోక, సాయి, భాస్కర్, చిన్ని, ఆశ అనే వ్యక్తులు, మరికొందరితో కలసి ఈ నెల 15న రాత్రి మద్యం తాగి మా కొట్టు దగ్గరికి వచ్చారు. వైకాపా ప్రాంతంలో ఉండి ఎన్డీయే అభ్యర్థికి ఓటెలా వేస్తారని దుర్భాషలాడారు. లోకేశ్‌ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తూ, బూతులు తిట్టారు. అనంతరం మమ్మల్ని తలలు పగిలి, రక్తం కారేలా కొట్టారు. మా చెల్లి రమ్యను గర్భిణి అని కూడా చూడకుండా కడుపుపై తన్నారు. కర్రలతో గాయపరిచారు. మేమంతా తీవ్ర గాయాలతో కిందపడిపోతే మమ్మల్ని చేయందించి లేపుతున్న మా తమ్ముడు మణికంఠను కొందరు ఎత్తుకెళ్లి మేకులున్న కర్రతో నుదురు, తల మీద దారుణంగా కొట్టారు. దెబ్బల తీవ్రతకు బుగ్గలోంచి పళ్లల్లోకి మేకులు దిగబడ్డాయి. ఓటేయడానికి వచ్చిన మా తమ్ముడు, ప్రసవం కోసం వచ్చిన చెల్లెలు తీవ్ర గాయాలపాలయ్యారు. 

భయాందోళనలో ఉన్నప్పుడు పోలీసులు సంతకాలు చేయించుకున్నారు

కేవలం మేం ఎన్నికల్లో ఎన్డీయేకి ఓటేశామని, మా ఇంటి ముందున్న శిలాఫలకాన్ని తీసేయలేదన్న కుట్రతోనే కక్షగట్టి మాపై దాడి చేశారు. మేం జీహెచ్‌లో చికిత్స పొందుతుండగా.. 16వ తేదీ తెల్లవారుజామున పోలీసులు వచ్చారు. మేం భయాందోళనలతో వణికిపోతూ, పూర్తిగా తెలివిలో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏవో ప్రశ్నలు అడిగి, కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారు. అప్పటికే మా అమ్మ తల పగిలి గాయానికి 24 కుట్లు, మా తమ్ముడికి 14 కుట్లు, నాకు ఆరు కుట్లు వేశారు. ఆ బాధలో పోలీసులు మమ్మల్ని ఏమడిగారో కూడా తెలియని పరిస్థితుల్లో సంతకాలు చేయించుకున్నారు. 

వైకాపాకు ఓటేయలేదని మత్స్యకార మహిళలపై మట్టి మాఫియా ముద్ర

వైకాపాకు ఓటేయలేదని మాఫియా ముద్రవేసి ఆ పార్టీ సొంత పత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ది విశాఖపట్నం టౌన్‌ డ్రై ఫిషర్‌ ఉమెన్‌ సొసైటీ అధ్యక్షురాలు మారుపల్లి పార్వతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చేపల తిమ్మాపురంలోని సొసైటీ కార్యాలయంలో సోమవారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘గ్రామంలోని దాదాపు 200 కుటుంబాలు 2014, 2019 ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా నిలిచాం. మా గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి హోదాలో నిర్మాణాలకు శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత వేరే చోట ఇళ్ల స్థలాలిస్తామని మాట మార్చారు. సముద్రంపై ఆధారపడి బతికే మాకు ఈ ఊరికి దగ్గర్లోనే స్థలాలివ్వాలని కోరినా వైకాపా నేతలు పట్టించుకోలేదు. దీంతో ఈ ఎన్నికల్లో తెదేపాకు మద్దతు పలికాం. దాన్ని జీర్ణించుకోలేని వైకాపా నేతలు మేం మహిళలమని కూడా చూడకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మాపై తప్పుడు వార్తలు రాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గ్రావెల్‌ అమ్ముకొని అక్రమంగా సంపాదించింది వైకాపా నాయకులే. మేం కష్టపడి చేపలు అమ్ముకుని జీవిస్తున్నాం’ అని ఆవేదనగా చెప్పారు. ‘విశాఖ హార్బర్‌ వద్ద చేపలు విక్రయించే 168 మంది మహిళలను 1987లో  చేపల తిమ్మాపురానికి తరలించారు. ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఐదేళ్లుగా పోరాడుతున్నాం.  తెదేపా ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో ఈసారి  గ్రామస్థులమంతా ఆ పార్టీలో చేరి మద్దతిచ్చాం. ఇది నచ్చని వైకాపా నేతలు ఆ పార్టీ పత్రిక ద్వారా మాపై బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు’ అని సొసైటీ గౌరవ సలహాదారు మారుపల్లి అమర్‌నాథ్‌ పేర్కొన్నారు.


బాధితులకు అండగా నిలవడం తప్పా?: విష్ణుకుమార్‌రాజు

విలేకర్లతో మాట్లాడుతున్న విష్ణుకుమార్‌ రాజు

కంచరపాలెం పోలీసులు నమోదు చేసిన కేసుపై భాజపా అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు సోమవారం స్టేషన్‌కు వెళ్లి వివరణ ఇచ్చారు. ఆయనకు పోలీసులు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘వైకాపా మూకల దాడిలో గాయపడ్డ బాధితులకు చేయాలన్న ఉద్దేశంతో ప్రెస్‌మీట్‌ పెడితే నాపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఈ ఘటనను ప్రసారం చేసిన మీడియా సంస్థలకూ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఇక్కడ వాక్‌ స్వాతంత్య్రం ఉందా లేదోననే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికలు పూర్తయ్యాక బాధితులకు న్యాయం చేయాలని ప్రెస్‌మీట్‌ పెడితే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, 41ఏ నోటీసులు ఇవ్వడం దారుణం. మాపైనే కేసులు పెడితే భవిష్యత్తులో ఎవరైనా ప్రెస్‌మీట్లు పెడతారా? ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా నేనేం తప్పు చేశానని సుమోటోగా కేసు పెట్టారు? అన్యాయానికి గురై తీవ్ర గాయాలతో రక్తమోడుతూ నా దగ్గరకు వచ్చిన బాధితులను ఆదరించడం తప్పా? ఒక బాధ్యత గల నాయకుడిగా స్పందించడం నేరమా? శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. నాకు నోటీసులివ్వడం ఎంతవరకు సమంజసం’ అని మండిపడ్డారు.

‘గతంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విశాఖకు వచ్చినప్పుడు.. విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా ఇదే నియోజకవర్గానికి చెందిన వైకాపా నేత కేకే రాజు అడ్డుకున్నారు. పోలీసులను కూడా తోసేసి చంద్రబాబుపై కోడిగుడ్లు, నీళ్ల సీసాలు, చెప్పులు విసిరారు. అసభ్యంగా మాట్లాడారు. అలాంటి వ్యక్తిపై సుమోటోగా కేసు పెట్టాలని అప్పుడు పోలీసులకు గుర్తు రాలేదా? జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో జనవాణి కార్యక్రమం తలపెడితే.. నోవోటెల్‌ హోటల్‌ నుంచి పోర్టు కళావాణి స్టేడియంకి రాకుండా అడ్డుకున్నదెవరు? ఆ ఘటనపై పోలీసులు ఎందుకు సుమోటోగా కేసు పెట్టలేదు? భవిష్యత్తులో బాధితులకు అండగా నిలిచేందుకు వార్తలు రాసే విలేకర్లపైనా కేసులు పెట్టి అరెస్టు చేస్తారేమో’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాధితులు ఇప్పటికీ వారి ఇంటికి వెళ్లలేదు. పోలీసులు ఇప్పటికీ వాళ్ల ఇంట్లో రక్తపు మరకల ఫొటోలు తీయలేదు. బాధితులు న్యాయం కోసం కలెక్టరేట్‌కు వెళ్లారు. ఈ ఘటనలో ఒక్కర్నే అరెస్టు చేసి మిగిలిన వారిని వదిలేశారు. తలలు పగిలేలా రక్తాలు కారేలా కొట్టిన వారిని వదిలేశారు. బాధితులు ఏ పార్టీ కార్యకర్తలూ కాదు. ఎన్డీయేకి ఓటు వేశామని చెప్పడమే వారు చేసిన పాపం’ అని ఆయన పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని