India vs Pakistan: భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. ఆ టికెట్లకు భారీ ధరపై లలిత్‌ మోదీ ఫైర్‌!

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా త్వరలో భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ టికెట్లపై ఐసీసీ నిర్ణయించిన ధర చర్చనీయాంశంగా మారింది. 

Published : 24 May 2024 00:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియా, పాకిస్థాన్‌ (India vs Pakistan) మ్యాచ్‌లకు ఎప్పటికీ ఫుల్ క్రేజ్‌ ఉంటుంది. అయితే, ఈ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పదేళ్లుగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. దీంతో ఐసీసీ ఈవెంట్లలో దాయాది దేశాల మధ్య మ్యాచ్‌ అంటే క్రికెట్ అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఉంటోంది. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా త్వరలో ఈ రెండు దేశాలు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌ టిక్కెట్లపై ఐసీసీ భారీ ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

దీనిపై ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీ (Lalit Modi) స్పందించారు. ఐసీసీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్ టికెట్ల ధరను 20 వేల డాలర్లు (రూ.16 లక్షలకు పైగా)గా ఐసీసీ నిర్ణయించింది. దీనిపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

కోల్‌కతా ‘ఫైనల్‌’ ప్రత్యర్థి ఎవరు? గాయపడ్డ హైదరాబాదా.. జోరు మీదున్న రాజస్థానా?

‘‘అమెరికాలో జరగనున్న ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు సంబంధించి డైమండ్‌ క్లబ్‌ టికెట్లను 20,000 డాలర్లకు ఐసీసీ విక్రయిస్తోందని తెలిసి షాకయ్యా. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ సిరీస్‌ను అమెరికాలో నిర్వహిస్తున్నామని.. టికెట్ల రూపంలో ఆదాయం సమకూర్చుకునేందుకు కాదని చెప్పారు’’ ఎక్స్‌ వేదికగా అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే.. ఈ ఆరోపణలపై ఐసీసీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలాఉండగా.. టీ20లో భాగంగా న్యూయార్క్‌ వేదికగా జూన్‌ 9న భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని