Qualifier 2 - Hyderabad vs Rajasthan: కోల్‌కతా ‘ఫైనల్‌’ ప్రత్యర్థి ఎవరు? గాయపడ్డ హైదరాబాదా.. జోరు మీదున్న రాజస్థానా?

శుక్రవారం చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్‌ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరి కోల్‌కతాను ఢీకొట్టనుంది.

Updated : 24 May 2024 12:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కోల్‌కతా ప్రత్యర్థిని తేల్చబోయే ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌, రాజస్థాన్‌ ఫైనల్‌ స్లాట్‌ కోసం శుక్రవారం పోరాడబోతున్నాయి. బెంగళూరును ఓడించి రెండో క్వాలిఫయర్‌లోకి అడుగుపెట్టిన రాజస్థాన్‌, తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న హైదరాబాద్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరి ఇరు జట్ల బలాలు, ఆటగాళ్ల ఫామ్‌ తదితర అంశాలపై ఓ లుక్కేద్దాం. 

హోరాహోరీ తప్పదా?

  • వరుసగా నాలుగు ఓటములను చవిచూసిన తర్వాత కీలకమైన ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్‌ తన సత్తా చాటింది. మరోవైపు లీగ్‌ స్టేజ్‌లో దూకుడుగా ఆడిన సన్‌రైజర్స్ ఇప్పుడు డీలా పడింది. ఈ క్రమంలో ఎవరు ఫైనల్‌కు చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. 
  • ఎస్‌ఆర్‌హెచ్ - ఆర్‌ఆర్‌ ఇప్పటివరకు ముఖాముఖిగా 19 మ్యాచుల్లో తలపడ్డాయి. హైదరాబాద్‌ 10 మ్యాచుల్లో గెలవగా.. రాజస్థాన్‌ తొమ్మిదింట్లో విజయం సాధించింది. ఈ సీజన్‌లో అయితే ఇప్పటికి హైదరాబాద్‌దే పైచేయి.
  • హైదరాబాద్‌ జట్టులో బ్యాటింగ్‌ త్రయం అభిషేక్ శర్మ (470), ట్రావిస్ హెడ్ (533), హెన్రిచ్‌ క్లాసెన్ (413) నుంచి గత ఓటమి నుంచి తేరుకుని మరోసారి కీలక ఇన్నింగ్స్‌లు రావాలి. మిడిలార్డర్‌లో నితీశ్‌ రెడ్డి, అబ్దుల్ సమద్ నిలకడ చూపించాలి. 
  • ఎస్‌ఆర్‌హెచ్‌తో పోలిస్తే రాజస్థాన్‌కు బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్, హెట్‌మయెర్, పావెల్‌ను అడ్టుకోవడం సన్‌రైజర్స్ బౌలర్లకు అంత సులభం కాదు. 
  • పేస్‌ బౌలింగ్‌ విషయానికొస్తే హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్ కలిసి 45 వికెట్లను పడగొట్టారు. రాజస్థాన్‌లో బౌల్ట్, అవేశ్‌ఖాన్, సందీప్‌ శర్మ 40 వికెట్లు తీశారు. 
  • స్పిన్‌ విభాగంలో ఆర్‌ఆర్‌దే ఆధిపత్యం. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్‌ వంటి అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లున్నారు. వీరిద్దరూ కలిసి 27 వికెట్లు తీశారు. హైదరాబాద్‌లో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం గమనార్హం. షాబాజ్‌ అహ్మద్‌, ట్రావిస్ హెడ్, మయాంక్ మార్కండే అప్పుడప్పుడు బౌలింగ్‌ వేసేవారు.
  • చెపాక్ స్టేడియంలో రెండు జట్లకూ గొప్ప గణాంకాలు లేవు. ఎస్‌ఆర్‌హెచ్‌ 10 మ్యాచుల్లో కేవలం ఒక్కటే గెలవగా.. రాజస్థాన్‌ తొమ్మిదింట్లో రెండు విజయాలే సాధించడం గమనార్హం. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కావడం కష్టమే. ఈ సీజన్‌లో చెపాక్‌ వేదికగా గత 5 మ్యాచుల్లో మూడింట్లో లక్ష్య ఛేదనకు దిగిన జట్టు గెలవగా.. మరో రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ విజయం సాధించింది.
  • ఐపీఎల్‌ పవర్‌ ప్లే ఓవర్లలో అత్యధిక పరుగులు చేసిన జట్టు సన్‌రైజర్సే. హెడ్ - శర్మ జోడీ 125 పరుగులు జోడించింది. ఆ తర్వాత లఖ్‌నవూపైనా 107 పరుగులు సాధించింది. రాజస్థాన్‌కు ఈ సీజన్‌లో అత్యధిక పవర్‌ ప్లే స్కోరు 76. కోల్‌కతాపై ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఆ జట్టు ఓపెనర్లు చేశారు. దిల్లీపైనా (67) ఫర్వాలేదనిపించారు.
  • ఈ మ్యాచ్‌కు వాతావరణమూ సహకరించాల్సి ఉంది. చెపాక్‌లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. అయితే, మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దైతే హైదరాబాద్‌ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ కంటే ముందుండటమే దానికి కారణం.
  • ఈ సీజన్‌లో ఇరుజట్లు తలపడినప్పుడు.. మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు వెళ్లి మజానిచ్చింది. హైదరాబాద్‌ నుంచి హెడ్‌, నితీశ్, క్లాసెన్‌ రాణించగా.. ఆర్‌ఆర్‌ తరఫున జైస్వాల్‌, పరాగ్‌ రాణించారు. అయితే ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సిన సమయంలో పావెల్‌ను భువీ ఔట్‌ చేసి హీరో అయ్యాడు. మరి క్వాలిఫయర్‌ 2లో హీరో ఎవరవుతారో చూడాలి. 

తుది జట్లు (అంచనా):

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీశ్‌ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షహబాజ్‌ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, వియస్కాంత్, నటరాజన్‌

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, టామ్‌ కోహ్లెర్, సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్‌ ఖాన్, సందీప్ శర్మ, చాహల్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు